మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (19:05 IST)

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

delhi election
ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే దశలో ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పోలింగ్‌కు ముందు రెండు రోజులు కావడంతో ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు దిగే అవకాశం ఉండంతో నిఘాను మరింత పటిష్టం చేసింది. 
 
కాగా, ఎన్నికల ప్రచార చివరిరోజైన సోమవారం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల హోరాహోరీగా ప్రచారం చేశాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. రెండు దశాబ్దాలకు పైగా అధికారానికి దూరమైన భాజపా.. చివరి రోజు 22 రోడ్‌ షోలు నిర్వహించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. 
 
గత 2013కు ముందు 15 యేళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్‌.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.
 
ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం ఢిల్లీ వ్యాప్తంగా 13766 పోలింగ్ కేంద్రాలను ఏర్పటు చేయగా, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీని తెలుసుకునేందుకు క్యూ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ అప్లికేషన్‌ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ముందస్తు పోలింగ్‌ సదుపాయం కల్పించగా.. ఇప్పటికే 7,980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
పోలింగ్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15 వేల మంది హోంగార్డులు, 35 వేల మంది దిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 3వేల పోలింగ్‌ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు.
 
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జనవరి 7 నుంచి ఇప్పటివరకు 1049 కేసులు నమోదయ్యాయి. అలాగే, లక్ష లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేయడంతోపాటు 1353 మందిని అరెస్టు చేశారు. రూ.77 కోట్ల విలువైన 196 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.