ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (11:12 IST)

ఇందిరా ఎమర్జెన్సీని ప్రజలు హర్షించారు.. మోడీ నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు.. స్వామి వ్యాఖ్యలు

మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రజలు స్వాగతిస్తూ హర్షించారని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని భారతీయ జనతా పార్

మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రజలు స్వాగతిస్తూ హర్షించారని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై ప్రకటన చేసేందుకు చూపిన ఉత్సాహం... ఆ తర్వాత ఎదురైన పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని స్వామి విమర్శించారు. ప్రస్తుతం యావత్ దేశ వ్యాప్తంగా నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దాలని ఆయన సూచించారు. అలా చేయని పక్షంలో పరిణామాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. ప్రజాదరణ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని స్వామి హెచ్చరించారు.
 
దేశంలో నోట్ల రద్దు నిర్ణయంపై సెలెబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో స్పందిస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇపుడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి స్పందించారు. నోట్ల రద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణమే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి సూచించారు. ఇలా చేస్తే నోట్ల రద్దు ఎఫెక్ట్ వచ్చే (2019) ఎన్నికల్లో పెద్దగా ఉండదని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ప్రజలకు కొంతవరకు ఇబ్బందులున్నాయి నిజమే.. దీంతో ప్రభుత్వంపై మొదట వ్యతిరేకం వచ్చినా ఆపై పరిస్థితులు చక్కబడుతాయ్ అన్నట్లుగా స్వామి చెప్పుకొచ్చారు.
 
ముఖ్యంగా.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌లో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన విషయాన్ని స్వామి గుర్తు చేశారు. ఆరు నెల్ల ఎమర్జెన్సీ అనంతరం ప్రభుత్వంపై ప్రజలకు అభిప్రాయాలు మారాయి. దీంతో ప్రజాదరణ అంతా ఆమెకు సానుకూలంగా మారి జై కొట్టారని స్వామి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్థిక మంత్రి జైట్లీ గురించి మాట్లాడిన ఆయన.. జైట్లీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్లను రద్దు చేశారు సరే.. అమలు తీరు మాత్రం ఘోరంగా ఉందన్నారు. దేశానికి ఆర్థికవేత్తలైన ఆర్థికశాఖ మంత్రులు అవసరమే కానీ.. 2+2=4 చెప్పే వారు మాత్రం అనవసరం అని వ్యంగ్యంగా మాట్లాడారు.