శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తుండగా... వారాంతంలో మాత్రం ఆ సంఖ్యను 2వేలకు పరిమితి చేసింది.
ఇక రోజు అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా అనుమతి ఇవ్వాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. అయితే అన్ని శాఖలతో ప్రభుత్వం చర్చించాకే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆలయం మూత పడింది. దీంతో భక్తుల దర్శనం లేక ఆలయం కూడా ఆర్థికంగా చితికిపోయింది.
ఇక నిలక్కల్ దగ్గర కరోనా పరీక్ష కేంద్రాల నుంచి సన్నిధానం వద్ద ఉన్న శానిటైజేషన్ వ్యవస్థ వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.లాక్‌డౌన్‌కు ముందు సీజన్ సమయంలో రోజుకు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారని... ఆ సమయంలో రూ.263 కోట్లు మేరా రెవిన్యూ వచ్చేదని అధికారులు తెలిపారు.
ఇక ఈ సారి ఆంక్షలు అమల్లోకి రావడంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల టెండర్లకు దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ సారి హుండీ ఆదాయం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.