ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (12:05 IST)

టీ వ్యాపారికి రూ.49 కోట్ల ఐటీ నోటీసు

income tax
గుజరాత్ రాష్ట్రంలోని ఓ టీ వ్యాపారికి ఆదాయ పన్ను శాఖ రూ.49 కోట్లకు నోటీసు పంపించింది. ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో జరిగింది. ఈ నోటీసులు చూడగానే ఆ వ్యాపారికి ప్రాణంపోయినంతపని అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పటాన్ జిల్లాలోని నవగంజ్ కమొడిటీ మార్కెట్లో ఖేమ్రాజ్ దేవ్ అనే వ్యక్తి టీ విక్రయించే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈయనకు ఆదాయపన్ను శాఖ ఏకంగా రూ.49 కోట్లకు పన్ను నోటీసులు జారీచేసింది. దీంతో అతడు ఖంగుతిన్నాడు. అయితే కాస్త తేరుకున్న దేవ్ గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు గుర్తించాడు. 
 
తాను టీ విక్రయిస్తున్న మార్కెట్ పరిధిలోనే బ్రోకరేజ్ వ్యాపారం చేస్తున్న అల్పేశ్, విపుల్ పటేల్ ఇద్దరూ తన పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించారని దేవ్ చెబుతున్నాడు. కొన్నేళ్ల క్రితం వారివురితో తనకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ తన టీ షాపుకి వచ్చి టీ తాగి వెళ్లేవారని చెప్పాడు.
 
7వ తరగతి వరకే చదువుకున్న దేవ్ 2014లో తన బ్యాంక్ ఖాతాను పాన్ కార్డ్ లింక్ చేసుకునేందుకు సాయం చేయాలంటూ అల్పేశ్, విపుల్ సోదరులను అడిగాడు. వారు కోరడంతో ఆధార్, పాన్ కార్డుతోపాటు ఒక ఫొటో కూడా ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్, పాన్ కార్డులను దేవ్‌కు తిరిగి ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని పేపర్లపై కూడా సంతకాలు చేశానని దేవ్ చెబుతున్నాడు. వారిద్దరే తనని మోసం చేశారని దేవ్ చెప్పాడు.
 
కాగా ఆర్థిక సంవత్సరం 2015, 2016 సంవత్సరాల్లో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. కాగా గతేడాది ఆగస్టులో దేవికి తొలిసారి ఐటీ నోటీసులు వచ్చాయి. అయితే తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసులను పట్టించుకోలేదు. తిరిగి రెండోసారి నోటీసులు రావడంతో మ్యాటర్ సీరియస్ అని దేవ్ గుర్తించాడు. ఈ నోటీసులపై ఐటీ శాఖ స్పందించాల్సివుంది.