సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (18:52 IST)

పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చరంజిత్ సింగ్ చన్నీ

పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా చరంజిత్ సింగ్ చన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చరంజిత్ సింగ్ చన్నీ అని ఆదివారం సాయంత్రం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఆయన పంజాబ్ అసెంబ్లీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. 
 
వాస్తవానికి పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రులు వీరేనంటూ సుక్జిందర్ సింగ్ రంధావా సహా మరికొన్ని పేర్లు వినిపించాయి. అయితే వీరందరినీ కాదని చరంజిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్టాణం ఖరారు చేసింది.
 
త‌న‌ను అవ‌మానిస్తున్నారంటూ కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ శనివారం సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత. 
 
నిజానికి తొలుత సుఖ్‌జింద‌ర్ సింగ్ ర‌ణ్‌ద‌వా పేరును నూత‌న సీఎంగా ఎంపిక చేసిన‌ట్లు ఏఐసీసీ ప్రకటించింది. కానీ, పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జ్యోతి సింగ్ సిద్ధూ ఢిల్లీకి వెళ్ల‌డంతో కాంగ్రెస్ అధిష్టానం వైఖ‌రి మార్చుకుని చన్నీ పేరును ప్రకటించింది. 
 
హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. 
 
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరంజిత్ సింగ్ చన్నీ వైపుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.