ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 జూన్ 2016 (08:27 IST)

ఢిల్లీ అపోలో హాస్పిటల్స్‌లో కిడ్నీ స్కామ్... దర్యాప్తుకు సహకరిస్తాం: అపోలో

ఢిల్లీ అపోలో హాస్పిటల్స్‌లో కిడ్నీ స్కామ్...

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన అక్రమ కిడ్నీల వ్యాపారం కేసులో దేశంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన అపోలో హాస్పిటల్స్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆస్పత్రికి చెందిన ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇంతపెద్ద దందా సాగించడం అసాధ్యమని నిందితుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. దీనిపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం కూడా సహకరించింది. ఈ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. 
 
గత కొన్ని నెలలుగా ఈ ఆస్పత్రిలో కిడ్నీ స్కామ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌లో పలువురుని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెలుగు చూసింది. నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు అపోలో వైద్యశాలకు చెందిన డాక్లర్ల ప్రమేయం ఉందని తేలడంతో కేసు దర్యాప్తుకు హాజరు కావాలని దవాఖాన అధికారులకు పోలీసులు ఆదివారం నోటీసులు జారీచేశారు.
 
అంతేకాకుండా, భారత్‌తోపాటు నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా అడ్డాలుగా సాగుతున్న ఈ కిడ్నీ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన రాజ్‌కుమార్‌ రావు కోసం పోలీసులు కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో దాడులు జరిపారు. ఆయా దవాఖానల నుంచి సేకరించిన వివరాలను 25 మంది సభ్యుల ప్రత్యేక బృందం పరిశీలిస్తుందని ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ మందీప్ రంధవా చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి ఐదుగురు దాతలను, ముగ్గురు స్వీకర్తలను పోలీసులు గుర్తించారు. వీరిపై చట్టపరమైన చర్య తీసుకొనే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు పోలీసుల దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తామని అపోలో యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కిడ్నీల అక్రమ దందా ఎంతో ఆందోళనకర అంశమని, పోలీసులకు ఎటువంటి సమాచారం అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. దాతకు, స్వీకర్తకు మధ్య బంధుత్వాన్ని చూపేందుకు నిందితులు బోగస్, ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రలో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.