ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మే 2016 (20:23 IST)

నీట్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు: జాతీయస్థాయిలో ఒకే వైద్య విద్య పరీక్ష!

వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించే అర్హత రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జాతీయస్థాయిలో వైద్య విద్య పరీక్ష ఒక్కటే ఉండాలని, ఒకే పరీక్ష నిర్వహించాలన్న గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 
 
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోథా పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం నీట్ -1కి హాజరైన విద్యార్థులు నీట్-2కి హాజరుకావచ్చునని స్పష్టం చేసింది. మే ఒకటో తేదీన నీట్ పరీక్షకు హాజరైన వారు ఆ పరీక్షను వదులుకుని జూలై 24న నిర్వహించే పరీక్షకు హాజరుకావచ్చునని తెలిపింది.
 
హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ, అస్సామీ, తమిళం, బెంగాలీ, మరాఠి, గుజరాతీ భాషల్లో నీట్‌ నిర్వహించాలని పేర్కొంది. నీట్‌-1 మాదిరిగా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోనే ప్రశ్నాపత్రం ఉండాలని ఎన్‌సీఐ తెలుపగా, ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించేందుకు అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఎస్‌ఈ తెలిపింది.