సుప్రీంకోర్టు 'నీట్'గా తీర్పు... తెలంగాణాలో మెడికల్ ప్రవేశ పరీక్ష రద్దు
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం సాయంత్రం నీట్‌గా తీర్పును వెలువరించింది. వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండాలనీ, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదంటూ తేటతెల్లం చేసింది. దీంతో వైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖచ్చితంగా నీట్ పరీక్షకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీట్‌ను సుప్రీం కోర్టు తప్పనిసరి చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన మెడిసిన్ ప్రవేశ పరీక్షను రద్దు చేసింది. అదేసమయంలో ఎంసెట్ షెడ్యూళ్లూ మారనున్నాయి. అంతేకాదు ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రవేశ పరీక్ష కూడా రద్దు కానుంది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం నీట్‌ను రాయాల్సి ఉంటుంది.
జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో రాష్ట్ర స్థాయి ర్యాంకుల ఆధారంగానే స్థానిక విద్యార్థులకు ప్రవేశాలను కల్పిస్తారు. పరీక్ష మారినా.. సీట్ల కేటాయింపుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, నీట్ మాత్రం సీబీఎస్ఈ విధానం ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. కానీ, ఎంసెట్‌లో రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.