సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (08:48 IST)

బలపరీక్ష సక్రమంగా జరగలేదు.. చర్యలు తీసుకోండి?: హోంశాఖకు గవర్నర్‌ రిపోర్టు!

తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు, పరిణామాలపై కేంద్ర హోం శాఖకు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక నివేదికను పంపించారు. ఈ నివేదికలో ఆయన కీలకాంశాలను ప్రస్తావిం

తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు, పరిణామాలపై కేంద్ర హోం శాఖకు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక నివేదికను పంపించారు. ఈ నివేదికలో ఆయన కీలకాంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్ష సభ నియమనిబంధనలకు అనుగుణంగా జరగలేదని, అందువల్ల చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదికలో కోరినట్టు తెలుస్తోంది. 
 
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన సారథ్యంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం శనివారం అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన సంఘటనలపై రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు కేంద్ర హోంశాఖకు సవివరమైన నివేదిక పంపారు. 
 
శనివారం నాటి బలపరీక్ష సందర్భంగా సభ రెండు సార్లు వాయిదా పడటం, సీఎం ఎడప్పాడి పళనిసామి సభలో రెండు సార్లు విశ్వాసతీర్మానాన్ని ప్రతిపాదించడం, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభ్యుల ధర్నా, వారి గెంటివేత తదితర సంఘటనలను ఈ నివేదికలో ప్రస్తావించారని సమాచారం. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా, అసెంబ్లీ కార్యదర్శి అందించిన సమాచారం మేరకు గవర్నర్‌ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. 
 
రహస్య ఓటింగ్‌ జరపాలని డీఎంకే సభ్యులు సభలో సృష్టించిన గందరగోళం, స్పీకర్‌ పోడియంను ముట్టడించడం, స్పీకర్‌ సీటులో డీఎంకే సభ్యులు కూర్చోవడం, స్పీకర్‌ సీటులో లేనప్పుడు డీఎంకే ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బయటకు లాక్కురావడం వంటి సంఘటనలను కూడా తన నివేదికలో గవర్నర్‌ సవివరంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికలోని అంశాలను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.