ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

వరల్డ్‌ కప్‌లో ఓడిన భారత్... ప్రాణాలు కోల్పోతున్న క్రికెట్ వీరాభిమానులు

deadbdoy
క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, ఒడిశాలోని జాజ్‌పూర్‌లలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల రాహుల్ లోహర్ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బంకురాలోని బెలిటోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సినిమా హాల్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని బావమరిది ఉత్తమ్ సూర్ వెల్లడించాడు. 
 
చీరల దుకాణంలో పనిచేస్తున్న లోహర్ ఫైనల్ మ్యాచ్ రోజు డ్యూటీ ఎగ్గొట్టాడని, ప్రొజెక్టర్‌పై మ్యాచ్‌ని వీక్షించాడని లోహర్ బావ ఉత్తమ్ సుర్ వివరించాడు. భారత్ మ్యాచ్ ఓడిపోయాక ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడని చెప్పాడు.  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సోమవారం ఉదయం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి పంపించామని, ఆత్మహత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
 
అలాగే, ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో, ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే మరో 23 ఏళ్ల వ్యక్తి బింజర్‌పూర్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌కు ఉరివేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. మృతుడు దేవ్ రంజన్ దాస్ "ఎమోషనల్ డిజార్డర్ సిండ్రోమ్" కోసం చికిత్స పొందుతున్నాడని అతని మామ పోలీసులకు తెలిపారు. ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో నిరాశతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. "మేము ఆత్మహత్య కేసు నమోదు చేసాం. శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం" అని జారి అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి ఆఫీసర్ ఇంద్రమణి జువాంగా తెలిపారు.