బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (16:28 IST)

రైల్వే బడ్జెట్ : సూపర్బ్- మోడీ : ప్చ్.. చప్చగా వుంది - విపక్షాలు

కేంద్ర మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అనంతరం మీడియాతో ప్రధాని మాట్లాడుతూ, ఇది అధునాతన, రైల్వేలను మరింత ఆధునకీకరించే బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. దేశంలో 50 ప్రధాన స్టేషన్లలో శుభ్రతను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ఆర్పీఎఫ్ మహిళా పోలీసులను నియమిస్తామని, రైల్వేలను ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 
 
మరోవైపు.. విపక్ష నేతలు మాత్రం సదానంద రైల్వే బడ్జెట్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు బడ్జెట్ బాగుందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తే... ప్రతిపక్ష సభ్యులు మాత్రం విమర్శలు చేశారు. బడ్జెట్ సమర్పించడం ముగియగానే సభలో బీజేపీ సభ్యులు "మోడీ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. 
 
ఈ రైల్వేబడ్జెట్ రైలు ప్రయాణాన్ని ఆనందమయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ దేశంలోని పేదలకు అనుకూలంగా లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రైల్వే బడ్జెట్ అప్రధానమైన విషయాల పైన దృష్టి పెట్టిందని రైల్వే శాఖ మాజీ మంత్రి పి.కె.బన్సల్ అన్నారు. లోపాల గురించి బడ్జెట్‌లో చెప్పారు కానీ, పరిష్కార మార్గాలు చూపలేదని మాజీ మంత్రి అశ్విన్ కుమార్ పెదవి విరిచారు. 
 
అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. తమ రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. రైల్వేబడ్జెట్‌లో బెంగాల్‌కు మొండిచేయి చూపారంటూ ఫేస్ బుక్‌లో వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో బెంగాల్‌కు కేటాయించింది ఏమీ లేదు. కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు రిక్తహస్తం చూపింది అని మమత పేర్కొన్నారు.