మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే...

narendra modi
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం కూడా పర్యటించనున్నారు. ఇది ఆయన రెండో రోజు పర్యటన. ఈ పర్యటనలో భాగంగా, ఆయన మంగళవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. 10.45 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతారు. రూ.6800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పలేట్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పర్చువల్‌గా ఆయన పాల్గొంటారు. 
 
రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్.హెచ్.161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి క్రాస్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్.హెచ్-65ని ఆరు లేన్ల రహదారిగా మార్చేందుకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేస్తారు. ఇక మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో ఎన్.హెచ్ 765డి మెదక్ - ఎల్లారెడ్డి హైవే విస్తరణ రూ.500 కోట్లతో ఎల్లారెడ్డి - రుద్రూర్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. 
 
ఆ తర్వాత జిల్లాలోని పఠాన్‌చెరులో 11.20 గంటలకు నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు. ఇందుకోసం సుమారుగా 2 వేలకు పైగా పోలీసు బలగాలను వినియోగించారు. అలాగే, బహిరంగ సభకు వచ్చేవారు ఎలాంటి వస్తువులు తీసుకుని రావొద్దని భద్రతా అధికారులు సూచించారు. కాగా, సోమవారం కూడా ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్ర పర్యటన చేశారు. చెన్నైలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
ఫ్యాక్షన్ ముసుగు తొలగించిన జగన్.. అందుకే నెల్లూరులో పోలీసులతో అలజడి : నారా లోకేశ్ 
 
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ ముసుగు తొలగించారని, అందుకే నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లపై పోలీసులతో దాడులు చేయిస్తూ అలజడి సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు అనేక మంది టీడీపీలో చేరారు. వీరిలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో వైకాపా పూర్తిగా పట్టుకోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. పైగా, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ ఫ్యాక్షన్ ముసుగు తొలగించారని, ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. 
 
జగన్ నియంతృత్వ పోకడలకు భరించలేకనే పలువురు వైకాపా నేతలు టీడీపీలో వలస వస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరణామాలను జీర్ణించుకోలోని జగన్ తన ఫ్యాక్షన్ రాజకీయాలకు పదును పెడుతున్నారన్నార. అందుకే నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని, విజితా రెడ్డి, పట్టాభిమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఫైనాన్షియర్ గురబ్రహ్మంలో ఇళ్లకు పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేశ్ ఆరోపించారు. 
 
పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారని తెలపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రానికి ఈసీ ఒక పరిశీలకుడిని పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఆయన కోరారు. జగన్ తొత్తులుగా మారిన కొందరు పోలీసుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.