గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (07:18 IST)

నేడు చెన్నైకు ప్రధాని మోడీ రాక.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు

narendra modi
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం చెన్నై నగరానికి వస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలోనూ, కల్పాక్కం అణు విద్యుత్ కేంద్రం పరిసరాలలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఐదు అంచల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన నందనం వైఎంసీఏ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 
 
ప్రధాని పర్యటనపై అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోడీ సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మహారాష్ట్ర నుంచి విమానంలో మధ్యాహ్నం 2.45 గంటలకు మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టరులో కల్పాక్కం అణు విద్యుత్ కేంద్రానికి చేరుకుని, అక్కడ రూ.400 కోట్లతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంధన రీసైక్లింగ్ బ్లాస్టర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.15 గంటల మధ్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాప్టరులో మీనాంబాక్కం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో నందనం వైఎంసీఏ మైదానం వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగింస్తారు. ఈ సభ ముగిసిన వెంటనే మోడీ కారులో మీనాంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి విమానంలో తెలంగాణకు బయలుదేరుతారు.
 
ప్రధాని మోడీ రాక సందర్భంగా నగరంలో పోలీసు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల బెంగళూరులోని ఓ హోటల్లో బాంబు పేలిన ఘటన నేపథ్యంలో చెన్నైకి వస్తుండటంతో ప్రధానికి పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. కల్పాక్కం అణు విద్యుత్ కేంద్రం వద్ద, బీజేపీ బహిరంగ సభ జరగనున్న నందనం వైఎంసీఏ మైదానం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లోనూ సాయుధ పోలీసులు కాపలా కాస్తున్నారు. అదేవిధంగా నగరంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రోన్లు ఎగరవేయకూడదంటూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
కాగా, ప్రధాని మోడీ రాకను పురస్కరించుకుని నందనం వైఎంసీ మైదానం పరిసర ప్రాంతాల్లో అన్నాసాలైలో ట్రాఫిక్ మార్పులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు నందనం నుంచి అన్నాసాలై జెమినీ బ్రిడ్జి వరకూ వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, వాహన చోదకులు ఆ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు. అన్నాసాలై, సర్దార్ పటేల్ రోడ్డు, గాంధీ మండపం రోడ్డు, జీఎస్టీ రోడ్డు, మౌంట్, పూందమల్లి రోడ్డు, సీపెట్ జంక్షన్, వందడుగుల రహదారుల్లో వాహన చోదకులు ప్రయాణించకపోవడమే మంచిదని తెలిపారు. 
 
మధ్యకైలాష్ నుంచి హాల్డా జంక్షన్ వరకు, ఇందిరాగాంధీ రోడ్డు పల్లావరం నుండి కత్తిపారా జంక్షన్ వరకు, మౌంట్ పూందమల్లి నుంచి రామాపురం నుండి కత్తిపారా జంక్షన్ వరకు, అశోక పిల్లర్ నుంచి కత్తిపార జంక్షన్ వరకు, అన్నావిగ్రహం నుంచి మౌంట్ రోడ్డు వరకు, తేనాంపేట నందనం గాంధీ మండపం వరకు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలు, వ్యాన్లు తదితర వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.