ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (13:27 IST)

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌కు తొలిసారి వెళ్ళనున్న ప్రధాని!!

Modi
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. ఈ సాహసోపేతమైన నిర్ణయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. మార్చి 7వ తేదీన శ్రీనగర్‌లో జరిగే భారీ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
శ్రీనగర్‌లోని షేర్‌ ఈ కాశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ప్రధాని సభ జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. మోడీ పర్యటనను పురస్కరించుకుని కాశ్మీర్‌ లోయలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ప్రధాని జమ్మూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
 
జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అప్పటి నుంచి ప్రధాని మోడీ మూడు సార్లు జమ్మూలో పర్యటించగా.. కాశ్మీర్‌ లోయకు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని పర్యటన కీలకంగా మారింది.