శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (11:02 IST)

మార్లవాయి గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసిన మంత్రి సీతక్క...

mla sitakka
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ నక్సలైట్ దనసరి అనసూయ అలియాస్ సీతక్క ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ తన మూలాలు మాత్రం మరిచిపోలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆమె.. తన సమాజిక వర్గానికి చెందిన ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. తాజాగా ఓ మంత్రి హోదాలో ఉన్నప్పటికి మార్లవాయి గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఇప్పటికే ఆమె నిరాడంబరత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె కుమురం బీమ్ అసిఫాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేశారు. రోడ్డుపై మొక్క జొన్న కంకులను కొనుక్కొని తిన్నారు. ఆమె ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించారు. 
 
మార్లవాయి గ్రామస్తులతో కలిసి... ఆమె నేలపై కూర్చొని భోజనం చేశారు. అంతకుముందు కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఉడుంపూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకులు అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేసి తిన్నారు. మొక్క జొన్న కంకులు తియ్యగా ఉన్నాయని.. అన్నీ ఇచ్చెయ్.. పైసల్ ఇస్తానని ఆ మహిళ వద్ద మొత్తం కంకులను కొనుగోలు చేశారు.
 
సీతక్క గురువారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ ఘాట్ కాల్వను ఎమ్మెల్యే వెడ్మ భోజ్యతో కలిసి పరిశీలించారు. ఖానాపూర్ రైతులకు సదర్ ఘాట్ కాల్వ నుంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మల్ లోని కడెం ప్రాజెక్టును నిర్మల్లోని పరిశీలించారు. మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో నిర్మించిన హైమన్ డార్ఫ్ మ్యూజియంను ప్రారంభించారు. డార్ఫ్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.