శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:59 IST)

ఆమెకి దెయ్యం పట్టిందని జుట్టు పట్టుకుని పిడిగుద్దులు గుద్ది మంచంపై పడేసి తాళ్లతో కట్టేశాడు...

నాలుగు రోజుల క్రితం భూత వైద్యం పేరిట భూత వైద్యుడు ఓ బాలింతకు నరకం చూపించాడు. దీని ప్రభావం ఆ మహిళ ప్రాణం మీదికి వచ్చింది. ఆ భూత వైద్యుడు మహిళ తల వెంట్రుకలను లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న బాలింత ఆరోగ్యం విషమించడంతో సోమవారం అర్థరాత్రి మరణించింది.
 
ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలో జరిగింది. గ్రామానికి చెందిన మల్లేశ్ ఏడాది క్రితం రజిత అనే యువతిని  ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా 4 నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు దెయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భూతవైద్యుని ఆశ్రయించారు.
 
ఆ భూత వైద్యుని స్వయాన రజిత మేనమామ కుందారం లోని రజిత అత్తవారింటికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించారు. తర్వాత భూత వైద్యుడు పచ్చి బాలింతను కొడుతూ దెయ్యం వదిలిందా అని నరకం చూపించాడు. ఆపై మంచంపై పడేసి తాళ్లతో కట్టేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.
 
వెంటనే ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు భూతవైద్యుడప శ్యామ్ అతడికి సహకరించిన ఆమె బాబాయి రవీందర్‌ను అరెస్టు చేసి అత్తింటి వారిపై కేసును నమోదు చేసారు.