ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (16:01 IST)

బాలయ్య - బోయపాటి స్టోరీ లీకైంది

నందమూరి నట సింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అవ్వడం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారా..? అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇటీవల బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో మూవీని ఎనౌన్స్ చేయడం.. సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ప్రారంభించడం కూడా జరిగింది. 
 
ఇలా ఈ సినిమాని ప్రారంభించినప్పటి నుంచి సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్యను పవర్‌ఫుల్‌గా చూపించిన బోయపాటి ఈసారి ఎలా చూపించనున్నారు. అసలు... ఈ సినిమా కథ ఏమై ఉంటుంది..? అనేది బాలయ్య అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది.
 
 అయితే.. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... బాలయ్య ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని.. ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. ఒక పాత్ర అనంతపురంలో రైతుల కోసం పోరాటం చేస్తుంటాడు. 
 
ఇక హీరోయిన్ అంజలి కలెక్టర్ పాత్ర పోషిస్తుందని.. ఆమె బాలయ్యకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇక సెకండాఫ్ లో ఈ కథ కాశీకి షిప్ట్ అవుతుందట. అక్కడ కథ మొత్తం చాలా వైవిధ్యంగా... ఆడియన్స్‌కి షాక్ ఇచ్చేలా ఉంటుందని తెలిసింది. 
 
కాశీలో మరో బాలయ్య దర్శనమిస్తాడు. కాశీలో ఉండే బాలయ్యకు, అనంతపురంలో ఉన్న బాలయ్యకు సంబంధం ఏంటి అనేది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందట. మరో విషయం ఏంటంటే... అనంతపురంలో బాలయ్య రైతుల కోసం పోరాటం చేసే సన్నివేశాలు... ప్రజలు, పాలకులు ఆలోచించేలా ఉంటాయని తెలిసింది. 
 
ఇదే బాలయ్య - బోయపాటి మూవీ స్టోరీ
అని ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి అందరిలో ఒకటే ప్రశ్న. ఇటీవల కాలంలో రైతుల నేపధ్యంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఆ తర్వాత మహేష్‌ బాబు మహర్షి సినిమా వచ్చింది. 
 
రీసెంట్‌గా వచ్చిన నితిన్ భీష్మ సినిమా కూడా రైతుల నేపధ్యంలో రూపొందిందే. శర్వానంద్ శ్రీకారం సినిమా కూడా రైతుల నేపధ్యంలో సాగే సినిమానే. ఇలా రైతుల నేపధ్యంతో రూపొందిన సినిమాలు విజయం సాధించాయి. అయితే... రైతుల నేపధ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కదా. ఇందులో కొత్తగా ఏం చెబుతారు అనుకుంటారు కానీ.. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో చాలా వైవిధ్యంగా ఉండే కథ, కథనంతో ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కారణాల వలన లేట్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు. మార్చి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం.