రూ.70 కోట్ల భారీ బడ్జెట్ ''గౌతమీపుత్ర శాతకర్ణి''లో బాలీవుడ్ యాక్టర్ కబీర్ బేడీ!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో అత్యంత భారీగా తెరకెక్కుతున్నచిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో కూడా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు. బాలయ్య కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రస్తుతం నటీనటుల ఎంపిక వేగంగా జరుగుతోంది. అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చాలావరకు ఈ చిత్రంలో బాలీవుడ్ నటులను ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శాతకర్ణి తల్లి గౌతమి పాత్రకోసం బాలీవుడ్ నటి హేమమాలినిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన కబీర్ బేడి ''గౌతమీపుత్ర శాతకర్ణి''లో నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మొరాకోలో జరిగే మొదటిషెడ్యూల్‌లో కబీర్ బేడీ పాల్గొంటారని యూనిట్ సభ్యులు తెలిపారు. హీరోయిన్ పాత్ర కోసం ఇంకా ఎవరిని ఎంపికచేయలేదని నిర్మాత తెలిపారు. ఈ విషయమై నయనతారను సంప్రదించగా తాను ఆసక్తి కనబరచినా సెప్టెంబరు వరకు కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో మరో హీరోయిన్ కోసం దర్శకుడు గాలింపు చేపడుతున్నాడు.
''గౌతమీపుత్ర శాతకర్ణి''లో ఎవరు కథానాయకి పాత్ర పోషిస్తారో మరో రెండు మూడు రోజులో ఫైనలైజ్ చేస్తామని క్రిష్ తెలిపాడు.ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుంది.