సామాన్యుడి పోరాటం కాన్సెప్ట్‌గా పివిఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ చిత్రం
సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు అన్న కథాంశంతో పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ తమ తొలిచిత్రాన్ని నిర్మస్తోంది. రామ్ తేజ్, గరిమ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ రోజు ఫిలించాంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్ కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఆనంద్ రాజ్ ఓంకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముహర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు.
అనంతరం డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..``పీవీఆర్ ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు. దర్శకుడు అక్షయ్ కృష్ణకు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉంది. కాన్సెప్ట్ బాగుంటే కొత్త, పాత, చిన్నా, పెద్ద అని చూడకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలంగాణ ఫిలించాంబర్ తరఫున నా వంతు సాయం సినిమా రిలీజ్ సమయంలో చేస్తాను`` అన్నారు.
ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...``సినిమా సక్సెస్ అయితే అదే పెద్ద సినిమా. కంటెంట్ బావుంటే సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఒక మంచి కంటెంట్‌తో రూపొందుతోన్న ఈచిత్రం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
దర్శకుడు అక్షయ్ కృష్ణ నల్ల మాట్లాడుతూ...``కథ నచ్చి మా నిర్మాత పీవీఆర్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మీడియా నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రస్తుతం అమ్మాయిలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అలాంటి వాటిని మా హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథాంశం. ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటూ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. త్వరలో చీరాలలో షూటింగ్ ప్రారంభిస్తాం`` అన్నారు.
నిర్మాత పీవీఆర్ మాట్లాడుతూ..`` దర్శకుడు నాకు ఇరవై ఏళ్లుగా పరిచయం . ప్రతిభావంతుడు, సినిమా పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నవాడు. తను చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ప్రారంభించాను. దీనికి ఆనంద్ రాజ్ గారు పరిచయమైన అతి తక్కువ కాలంలో భాగస్వామిగా చేరారు. మంచి టీమ్ తో ఈ సినిమా నిర్మిస్తున్నాం`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్ తేజ్, హీరోయిన్ గరిమ, మధుప్రియ, నాగరాజు, ఆనంద్ రాజు ఓంకారం తదితరులు పాల్గొన్నారు.
మధుప్రియ, కావ్య, అజయ్ ఘోష్, సుమన్, చిత్రం శ్రీను, నాగరాజు, రానా, నరేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపిః శబరినాథ్; సంగీతంః రాజా; స్టంట్స్ః అశోక్ రాజ్, కృష్ణంరాజు; కొరియోగ్రాఫర్ః బ్రదర్ ఆనంద్ అండ్ రాము; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఆనంద్ రాజు ఓంకారం; నిర్మాతః పీవీఆర్; రచన-దర్శకత్వంః అక్షయ్ కృష్ణ నల్లం.