శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:44 IST)

దిల్ రాజు క్లాప్‌తో ప్రారంభ‌మైన సీతా కళ్యాణ వైభోగమే

Dil Raju Clap
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చారు. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అతిథులుగా హాజరయ్యారు. 
 
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ "నేను 'దిల్' రాజు గారి సంస్థలో దర్శకత్వ శాఖలో పని చేశా. ఆయన ఆశీర్వాదం, మద్దతుతో... మామిడి హరికృష్ణ గారి బ్లెస్సింగ్స్‌తో ఈ సినిమా చేస్తున్నా. ఇదొక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. మీరు అందరూ రామాయణం కథ వినే ఉంటారు. రాముడు తండ్రికి, భార్య (సీత)కు దూరం అయ్యాడు. రావణాసురుడు సీతను అపహరిస్తే... అతడితో యుద్ధం చేసిన రాముడు, భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు. రాముడికి హనుమంతుడు, వాలి, సుగ్రీవులు సపోర్ట్ చేశారు. అందులో జనకుడి పాత్ర ఎక్కడైనా కనపడిందా? సీత తండ్రిగా ఆయన ఏం చేశారు? ఈ పాయింట్ బేస్ చేసుకుని... నల్గొండలో జరిగిన ప్రణయ్ - అమృత ప్రేమకథ, మారుతి రావు ఇష్యూ మేళవించి ఫిక్షనల్ స్టోరీ రాశా. 'దిల్' రాజు గారి సినిమాలు ఎలా ఉంటాయో... అలా ఉంటూనే దర్శకుడిగా నా శైలిలో ఉంటుంది. వైల్డ్ యాక్షన్ సినిమా బ్లెండెడ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. అందరి మద్దతుతో మంచి సినిమా చేస్తున్నాం" అని అన్నారు.
 
Suman, Garima Chauhan
నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ "దర్శకుడు సతీష్, మా కాంబినేషన్ లో 'ఊరికి ఉత్తరాన' సినిమా తీశాం. అది ప్రేక్షకుల మన్ననలు పొందింది. మనం చాలా ప్రేమకథలు చూశాం. పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథలు సుఖాంతం అవుతాయి. ప్రేమ వివాహం తర్వాత అమ్మాయి తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది? కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది? కుటుంబ సభ్యులు, ప్రేమికులు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మంచి మద్దతు ఇస్తున్నారు. మాకు 'దిల్' రాజు గారు పెద్ద దిక్కు. ఆయన ఆశీర్వాదం, మద్దతుతో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి... ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ సినిమా చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణగారు వచ్చారు. ఆయన మద్దతు కూడా మాకు ఉంది" అని అన్నారు.
 
తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ "తెలంగాణ అంటే సకల కళల ఖజానా. తెలంగాణ యువతకు డ్రీమ్ డెస్టినేషన్... సినిమాల్లో ప్రతిభ నిరూపించుకోవడం. నటన, సాంకేతిక - దర్శకత్వ శాఖలో తమదైన ముద్ర వేయాలని తపన ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి యువకుడు సతీష్. ఆయన గతంలో 'ఊరికి ఉత్తరాన' సినిమా తీశారు. ఇప్పుడు 'సీతా కళ్యాణ వైభోగమే' తీస్తున్నారు. టైటిల్‌లో పాజిటివ్‌ వైబ్రేషన్స్ ఉన్నాయి. చక్కటి ఫ్యామిలీ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 
హీరోగా తనకిది తొలి చిత్రమని, నిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సుమన్ అన్నారు.  
 
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ "మంచి సాహిత్యం, సంగీతం పట్ల పట్టున్న దర్శకులతో పని చేయాలనే కల ఉంది. సతీష్ గారు కథ చెప్పినప్పుడే ఆయనలో సంగీత, సాహిత్య అభిరుచి కనిపించింది. ఆయనతో గతంలో పని చేయాల్సింది. కానీ, కుదరలేదు. ఇప్పుడు కుదిరింది" అని అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో హీరోయిన్ గరీమ చౌహన్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
సుమన్, గరీమ చౌహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, కల్పలత, గగన్ విహార్, రచ్చ రవి, లక్ష్మణ్ మీసాల ఇతర ప్రధాన తారాగణం. 
 
ఈ చిత్రానికి మేకప్: అర్జున్ - హరి, కాస్ట్యూమ్ డిజైనర్: స్వాతి మంత్రిప్రగడ, మేనేజర్: నారాయణ, పీఆర్వో: పులగం చిన్నారాయణ, పబ్లిసిటీ డిజైనర్: వెంకట్ & స్వామి కపర్ధి, ఎడిటర్: మధు, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, నిర్మాణ సంస్థ: డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్, నిర్మాత: రాచాల యుగంధర్, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సతీష్ పరమవేద