బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:15 IST)

సింగరేణి ప్రైవేటుపరానికి కేంద్రం కుట్ర : బాల్క సుమన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినట్టే సింగరేణి బొగ్గుగనులపై కూడా కూడా కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సమ్మెకు దిగితే సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని పదేపదే విన్నవించుకుంటున్నప్పటికీ కర్మాగారాన్ని నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇపుడు విశాఖ ఉక్క ఫ్యాక్టరీ లాగానే సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 
 
సింగరేణి బొగ్గు గనుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే ఢిల్లీలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై కేంద్రానికి సీఎం లేఖ రాశారనీ అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి, తెలంగాణాకు సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరంటూ ఆయన నిలదీశారు.