1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (19:52 IST)

సమతామూర్తిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.

 
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చిరకాల స్వప్నం సాకారమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేదపండితులచే వేదపారాయణం అంగరంగ వైభవంగా జరిగింది.

 
శ్రీశ్రీశ్రీ రామానుజాచూర్యుల వారి విగ్రహం వివరాలను చూస్తే... స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్‌లతో కూడిన 'పంచలోహ' అనే ఐదు లోహాల కలయికతో తయారుచేశారు. కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. థాయ్‌లాండ్‌లోని బుద్ధ విగ్రహం కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చెప్పబడుతుంది.
 
కాగా రామానుజాచార్యుల విగ్రహం 54 అడుగుల ఎత్తైన ‘భద్ర వేదిక’ అనే బేస్ భవనంపై అమర్చబడింది. ఈ భవనంలో వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, శ్రీ రామానుజాచార్యుల రచనలను వివరించే విద్యా గ్యాలరీ కోసం అంతస్తులు ఉన్నాయి. కాంప్లెక్స్‌లో దాదాపు 3,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామానుజాచార్యుల ఆలయం కూడా నిర్మించబడింది.

 
ఇక్కడ రోజువారీ పూజ కోసం 120 కిలోల బంగారు విగ్రహం ఉంచబడుతుంది. ఈ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్నజీయర్ స్వామి రూపొందించారు. 2014లో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్ద 45 ఎకరాల సుందరమైన జీయర్ ఇంటిగ్రేటెడ్ వేద అకాడమీలో కేంద్రీకృతమై వుంది.
 
 
తిరుమల, శ్రీరంగం, కంచి, అహోబిలం, బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం ఇంకా ఇతర ప్రాంతాలతో సహా దేశంలోని అనేక ప్రాంతాల నుండి 108 పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలు కూడా ఈ విగ్రహం చుట్టూ ఉన్నాయి. చూసేందుకు రెండు కన్నులు చాలనంత అద్భుతంగా తీర్చిదిద్దారు.