మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 29 జులై 2017 (10:36 IST)

పెళ్లే కాని నాకు 'ఫిదా' ఇద్దరు కూతుళ్లను ఇచ్చింది.. ఉద్వేగంతో కంట తడిపెట్టిన సాయిచంద్

అరవై ఏళ్ల జీవితంలో పెళ్లికాని, పిల్లలు లేని తనకు ఫిదా సినిమా ఇద్దరు ఆణిముత్యాల్లాంటి కూతుళ్లను ఇచ్చిందని, సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ ఇద్దరు పిల్లలతో తన అనుబంధం దూరం కాలేదని, మరింత బలపడుతోందని ఫిదా స

అరవై ఏళ్ల జీవితంలో పెళ్లికాని, పిల్లలు లేని తనకు ఫిదా సినిమా ఇద్దరు ఆణిముత్యాల్లాంటి కూతుళ్లను ఇచ్చిందని, సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ ఇద్దరు పిల్లలతో తన అనుబంధం దూరం కాలేదని, మరింత బలపడుతోందని ఫిదా సినిమాలో సాయి పల్లవి, శరణ్యల తండ్రిగా నటించి తెలంగాణ తండ్రి పాత్రకు ప్రాణప్రతిష్ట పోసిన విశిష్ట నటుడు సాయిచంద్ భావోద్వేగం చెందారు.  వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన మూవీ ‘ఫిదా’ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న విడుదలైన మూవీ సక్సెస్ మీట్‌ను గురువారం నిర్వహించారు. 
 
ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో ఆకట్టుకున్న సాయి పల్లవి తర్వాత అందరూ చర్చించుకుంటున్నది ఆమె తండ్రి పాత్రలో మెప్పించిన సీనియర్ నటుడు సాయి చంద్ గురించే. గురువారం నాటి సక్సెస్ సంబరాల కార్యక్రమంలో సాయిచంద్ మాట్లాడుతూ..సినిమాతోపాటు తన జీవితానికి చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
తెలుగు సినీపరిశ్రమలో తమ ఫ్యామిలీది తొలితరమని, ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగానే తన తండ్రి త్రిపురనేని గోపీచంద్ కొన్ని మూవీల్లో నటించారని గుర్తుచేసుకున్నారు. తాను 'మా భూమి'తో వెండితెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించినా గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. చాలా కాలం తర్వాత నటించినప్పటికీ ఫిదాలో సాయి పల్లవి తండ్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. 
 
విదేశాల నుంచి కూడా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తనకు ఫోన్ చేసి మీరు బాగా నటించారని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిదాలో మిమ్మల్ని చూస్తున్నంతసేపు మా నాన్నే గుర్తొచ్చారని ఫోన్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది చెప్పారన్నారు. అయితే నిజ జీవితంలో తనకు అసలు పెళ్లికాలేదని, పిల్లలే లేరని చెప్పిన సాయి చంద్.. తన పాత్రకు గుర్తింపునిస్తూ తండ్రిగా తనను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని ప్రొడక్షన్లలో పనిచేయలేదన్న బాధ ఈ మూవీలో నటించడంతో తీరిందన్నారు.
 
ముఖ్యంగా సాయిపల్లవితో శరణ్యతో తన అనుబంధం సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత మరింత బలపడిందని, కోయంబత్తూరులో ఉన్న పల్లవిని రెండు రోజులక్రితం రాత్రి పూట గుర్తు చేసుకున్నప్పుడు తెల్లార్లూ తనకు నిద్రపట్టలేదని ఉదయాన్నే లేచి ఆమె క్షేమం గురించి పరామర్శించినప్పుడు కానీ తాను మామూలు మనిషిని కాలేకపోయానని సాయిచంద్ చెప్పారు. ఇప్పటికీ వాళ్లిద్దరూ తనను నాన్నా అనే పిలుస్తారని, సినిమా ముగిశాక పాత్రలు దూరమవుతాయని కానీ ఫిదా తండ్రీ కూతుళ్లుగా తమ అనుబంధాన్ని మరింత గాఢంగా పెనవేసిందన్నారు. 
ఈ ఇద్దరు పిల్లలతో తనకు జన్మజన్మల బంధం ఏదో ఉన్నట్లుందని, అందుకే వారిద్దరి గురించి ఇప్పటికీ బెంగగా ఉంటుందని సాయిచంద్ చెప్పారు.
 
నాన్నా నువ్వెప్పుడూ మాకు నాన్నవే. బాధపడుకు. కోయంబత్తూరు వచ్చేయ్.. నాన్నలాగే నేను చూసుకుంటాను అంటూ సాయిపల్లవి చెబుతుంటే చలించిపోయేవాడినని సాయిచంద్ తెలిపారు. చివరకు ఐ డ్రీమ్‌ ప్రేమతో ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు కూడా ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్లే చెప్పి మరీ అలా నాచేత చేయించారన్నారు. వృద్ధుడిని కదా మామూలుగా పంచలో వస్తామని చెబితే ఏమొద్దు. చక్కగా క్షవరం చేసుకుని, రఫ్ అండ్ టఫ్‌గా రా అంటూ వాళ్లు పదే పదే చెప్పారని వారి మాట ఆదేశంగానే భావించి వారు చెప్పినట్లే చేశానని సాయి చంద్ చెప్పారు. 
 
దేశ విదేశాల నుంచి ఎంతోమంది పిల్లలు ఈ రోజుకీ తనకు ఫోన్లు చేస్తూ మీలో మా నాన్నను చూసుకుంటున్నామని, మా వద్దకు వచ్చేస్తే చల్లగా చూసుకుంటామని చెబుతున్నారని సాయిచంద్ సభాముఖంగా ప్రకటించినప్పుడు ప్రేక్షకులు చలించిపోయారు. నాకేంటి. తండ్రిపాత్ర ఇస్తున్నారు. నేను చేయలేను అని వ్యతిరేకత చెబితే పట్టుబట్టి నా పాత్ర విశిష్టత గురించి పూర్తిగా వివరించి ఫిదాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములకు చివరివరకూ కృతజ్ఞుడినై ఉంటానని సాయిచంద్ చెప్పారు. సృష్టి నాకు ఇచ్చిన అపూర్వమైన గిఫ్ట్‌ ఫిదాలో తండ్రిపాత్ర అన్నారు. 
 
ఇక ఆన్ లైన్‌లో ఐ డ్రీమ్ ప్రేమ చేసిన సాయిచంద్ ఇంటర్వ్యూను చూసిన వందలాదిమంది నెటిజన్లు సాయిచంద్‌కు సాంత్వన పలకడమే కాకుండా తండ్రి పాత్రలో ఒదిగిపోయారని చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుస్తామని చెబుతున్నారు. జీవితంలో నేను కోల్పోయినది ఏదో నాకు ఫిదా ఆ పిల్లల రూపంలో ఇచ్చిందని, బయటకు వెళ్లిన తర్వాతకూడా వారు నాన్నా నాన్నా అని నన్ను పిలుస్తుంటే జన్మజన్మల బంధం నా అనుభవంలోకి వస్తోందని సాయిచంద్ చెప్పినమాటలు నెటిజన్లు కదిలిపోతున్నారు.
 
ఈ మధ్య కాలంలో తెలుగులో మానవీయ కోణంలో వచ్చిన గొప్ప ఇంటర్యూను కింది లింకులో చూడండి. మనుషులు మర్చిపోయిన అనుబంధాల చెమ్మను, గుండెల్లో మూసుకుపోయిన తడిని మనకు చూపించే మహాద్భుత ఇంటర్వ్యూ ఇది. చివరివరకూ చూడండి, మిస్ కావద్దు.