ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (11:33 IST)

గొడవకు కారణమైన కెప్టెన్ టాస్క్ : అలీ ముఖంపై తన్నిన హిమజ

బిగ్‌బాస్ సీజన్ 3 రియాల్టీ షో కార్యక్రమం రసవత్తరంగా సాగుతోంది. స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో హౌస్ ఇపుడు కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు నిలయంగా మారింది. ముఖ్యంగా, బిగ్‌బాస్‌తో పాటు కెప్టెన్ ఇచ్చే టాస్క్‌లే ఈ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఫలితంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, పిడిగుద్దులు కురిపించుకోవడం, తన్నుకోవడాలు వంటివి సాగుతున్నాయి. తాజాగా హౌస్‌లో అలీ రెచ్చిపోయాడు. దీంతో హిమజ బోరున విలపిస్తూ అలీ ముఖంపై కాలితో తన్నింది. ఇది ఇపుడు బిగ్‌బాస్ హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బుధవారం రాత్రి ప్రసారమైన కార్యక్రమంలో హౌస్‌లో పెద్ద గొడవే జరిగింది. బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్‌ను పూర్తి చేసే క్రమంలో సభ్యుల మధ్య గొడవ జరిగి తన్నులాట వరకు వెళ్లింది. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా మారి నిధిని కొట్టేసే ప్రయత్నం చేయగా, వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేశ్‌ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. 
 
బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా, హిమజ లాయర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలో ఇంట్లో నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో రెండోసారి ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయగా హిమజ అతడి ముఖంపై తన్నింది. దీంతో కోపంతో ఊగిపోయిన అలీ ఆమెపై దాడికి యత్నించాడు. లాగిపెట్టి కొడతానంటూ ఆమెపైకి వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.
 
చివరికి హిమజ దిగొచ్చి అలీకి క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ అలీ వెనక్కి తగ్గకపోవడంతో కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. సింపథీ కోసం కాళ్లపై పడొద్దని అలీ అనడంతో బాత్రూముకు వెళ్లి బోరున విలపించింది. హిమజకు అండగా వెళ్లిన తమన్నాపైనా అలీ ఎదురుదాడికి దిగడంతో గొడవ పెద్దదైంది. అయితే, ఆ తర్వాత అలీ వచ్చి హిమజతో మాటలు కలపడంతో వివాదం సద్దుమణిగింది.