బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (19:55 IST)

చారి 111 కు సీక్వెల్ కు స్టార్ హీరోలను తీసుకురావాలని ఉంది : దర్శకుడు కీర్తీ కుమార్

Director Keerthy Kumar
Director Keerthy Kumar
'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన సరసన సంయుక్తా విశ్వనాథన్ నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...
 
తెలుగులో 'మళ్ళీ మొదలైంది' సినిమా చేశారు. దానికి ముందు మీరు ఏం చేశారు?
నేను సహాయ దర్శకుడిగా ఎవరి దగ్గర పని చేయలేదు. ఎడిటర్ గా నా కెరీర్ స్టార్ట్ చేశా. విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేశా. టీవీ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ ఎడిట్ చేశా. కాలేజీ చదివేటప్పుడు పాకెట్ మనీ కోసం టీవీ సీరియల్స్ ఎడిటింగ్ కూడా చేశా. తర్వాత బెంగళూరు వెళ్లి యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశా. సుమారు పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. దర్శకుడిగా నా తొలి సినిమా 'మళ్ళీ మొదలైంది'.
 
'చారి 111' ఎలా మొదలైంది?
నేను దర్శకత్వం వహించిన 'మళ్ళీ మొదలైంది'లో 'వెన్నెల' కిశోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు 'చారి 111' ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రిప్ట్ సెండ్ చేయమని అడిగారు. నేరేషన్ ఇవ్వమనలేదు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే చెప్పారు.
 
మీకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ముందు ఎవరికి చెప్పారు?
'చారి 111'కు ఇన్స్పిరేషన్ 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నాకు అటువంటి సినిమాలు ఇష్టం. నేను వెన్నెల కిశోర్ పాన్. 'జానీ ఇంగ్లీష్' ఫిల్మ్ చూసినప్పుడు నేను ఇండస్ట్రీలోకి ఎంటరైతే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఆయన కమెడియన్ రోల్ చేశారు. తర్వాత ఆయనతో సినిమా చేశా. ఇటువంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన సినిమాలు చూస్తే లీడ్ యాక్టర్లను మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేసినట్టు ఉంటాయి. కిశోర్, మురళీ శర్మ గారిని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా. తర్వాత విలన్, కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వచ్చాయి. 
 
స్పై యాక్షన్ అంటే సీరియస్ సబ్జెక్ట్. వెన్నెల కిశోర్ ని దృష్టిలో పెట్టుకుని కామెడీ యాడ్ చేశారా?
లేదండీ. సినిమా జానర్ వచ్చి స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. ' జేమ్స్ బాండ్' చూస్తే స్పై యాక్షన్. 'జానీ ఇంగ్లీష్' చూస్తే... స్పై యాక్షన్ కామెడీ. నాది రెండో కేటగిరీ సినిమా. కిశోర్ గారిని మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్ రాశా. ఆయన 'నో' అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది కాదు.
 
ఇంగ్లీష్ సినిమాల పేర్లు చెబుతున్నారు. తెలుగులో ఇన్స్పిరేషన్ ఏమీ లేదా?
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి 'రుద్రనేత్ర' ఉంది కదా! ఆ ఇన్స్పిరేషన్ తో మా సినిమాలో స్పై ఏజెన్సీకి 'రుద్రనేత్ర' అని పేరు పెట్టాను. 'చంటబ్బాయ్' సినిమాను మర్చిపోకూడదు. అందులో చిరంజీవి గారు డిటెక్టివ్. మా సినిమాలో హీరో స్పై రోల్. 
 
మురళీ శర్మను తీసుకోవడానికి కారణం?
వెన్నెల కిశోర్ గారు బాస్ ను ఇరిటేట్ చేస్తారు. ఆ పాత్రను ఆన్ స్క్రీన్ సీరియస్ గా కనిపించే యాక్టర్ కావాలని అనుకున్నా. ఎంత సీరియస్ గా ఉంటే కామెడీ అంత పండుతుంది. అందుకని మురళీ శర్మ గారిని అప్రోచ్ అయ్యాం. 
 
వెన్నెల కిశోర్ చేసిన సినిమాల్లో ఎందులో కామెడీ అంటే మీకు ఇష్టం?
ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆ తర్వాత కమెడియన్. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అద్భుతంగా చేశారు. నాకు ఆయనలో నటుడు ఇష్టం. 'ఓకే ఒక జీవితం' సినిమాలో చాలా సీరియస్ పోర్షన్స్ ఉన్నాయి. వాటిలో బాగా నటించారు. కామెడీ అవసరమైనప్పుడు కామెడీ చేస్తారు. 'గూఢచారి'లో కూడా సీరియస్ సీన్స్ బాగా చేశారు.
 
విలన్ ఎవరో చూపించలేదు. అతన్ని ఎందుకు దాచారు?
విలన్ మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అనేదానికి ఒక కారణం ఉంది. ప్రత్యేకంగా దాచాలని ఏమీ అనుకోలేదు. కథలో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దాన్ని మార్కెటింగ్ కోసం ఉపయోగించాం.
 
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నారా? లేదంటే వెన్నెల కిశోర్ ఓకే చేశారు కనుక ఈ సినిమా చేశారా? 
భవిష్యత్తులో స్టార్ హీరోలతో తప్పకుండా సినిమాలు చేయాలని ఉంది. 'వెన్నెల' కిశోర్ గారు ఓకే చేయడంతో 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఈ సినిమా చేశా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయాలని ఉంది. దానికి ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! రచయితగా, దర్శకుడిగా, ప్రేక్షకుడిగా ఈ సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
 
సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది!
ట్రైలర్ చూస్తే... రుద్రనేత్ర స్పై ఏజెన్సీ ఉంటుంది. అందులోకి మరింత మంది హీరోలను తీసుకు రావాలని ఉంది. 'చారి 111'కు కూడా సీక్వెల్ ప్లాన్ ఉంది. ఈ యూనివర్స్ లో ఏ సినిమా చేసినా స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ అవుతుంది.