శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:39 IST)

తండ్రి కోరిక నెరవేర్చడం కోసం రూ.కోట్లు ఖర్చు... కన్నడలో కూడా రిలీజ్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం షూటింగ్ జార్జియాలో జరుపుకోనుంది. ఇక్కడే చిత్రంలోని యుద్ధ సన్నివేశాలతో పాటు.. మరికొన్ని కొన్ని కీలక దృశ్యాలు చిత్రీకరిస్తారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం షూటింగ్ జార్జియాలో జరుపుకోనుంది. ఇక్కడే చిత్రంలోని యుద్ధ సన్నివేశాలతో పాటు.. మరికొన్ని కొన్ని కీలక దృశ్యాలు చిత్రీకరిస్తారు. 20 రోజుల నుంచి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ లీ విటేకర్‌ సారథ్యంలో వార్‌ సీన్ల రిహార్సల్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం పలు దేశాల నుంచి హార్స్‌ రైడర్స్‌, ఫైటర్స్‌ ఇప్పటికే జార్జియా చేరుకుని రిహార్సల్స్‌లో నిమగ్నమైవున్నారు.
 
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దళానికీ, బ్రిటీషువారికీ మధ్య జరిగే యుద్ధమిది. కనీవినీ ఎరుగని రీతిలో ఉండాలని కేవలం యుద్ధ సన్నివేశాల కోసం రూ.50 కోట్లు ఖర్చు పెడుతుండటం విశేషం. ఇంతవరకూ ఎవరూ చేయని లొకేషన్స్‌లో వార్‌ సీన్లు తీయాలని యూనిట్ భావించి జార్జియాకు వెళ్లింది. షూటింగ్‌ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి జార్జియాకు చేరుకున్నారు. ఈ నెలాఖరు నుంచి జార్జియాలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి సహా దాదాపు 200 మంది యూనిట్‌ సభ్యుల బృందం హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లనుంది. 
 
ఇకపోతే, తండ్రి కోరిక నెరవేర్చడం కోసం నిర్మాత రామ్‌చరణ్‌ బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇటీవల హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రూ.5 కోట్ల వ్యయంతో కొన్ని పోరాట ఘట్టాల్ని, నైట్‌ ఎఫెక్ట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడమే దీనికి ఉదాహరణ. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి సతీమణి సురేఖ సమర్పిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ నిర్మిస్తోంది. 
 
ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్ హీరో జగపతిబాబు, తమిళ హీరో విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది సంగీత బాణీలు సమకూర్చుతుండగా, వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
మరోవైపు, ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో మాత్రమే రిలీజ్ చేయాలని భావించారు. కానీ, తాజాగా కన్నడలో కూడా డబ్ చేసి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలన్న సంకల్పంతో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.