గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (23:06 IST)

నా విజయానికి శ్రీకారం చుట్టింది చిరంజీవిగారేః శర్వానంద్

Sharvanand Srikaram prerelease
సోమ‌వారం రాత్రి ఖమ్మంలో శ్రీ‌కారం సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్ర‌సంగించారు. అనంత‌రం శర్వానంద్ మాట్లాడుతూ..‘‘నా మొదటి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. నేను చూసిన మొదటి విజయం. నా విజయానికి శ్రీకారం చుట్టింది చిరంజీవి గారే. అలాంటి ఆయన ఇప్పుడు ‘శ్రీకారం’ సినిమాకు చీఫ్ గెస్ట్‌గా రావడంతోనే ఈ సినిమా సక్సెస్ అయింది. ‘శర్వా.. నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తల రాతను తిరిగి రాస్తాడు’ అని చిరంజీవి గారు నాతో అన్నారు. ఆ సంకల్పమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. నేను చాలా గర్వంగా చెప్పుకొనే పేరు నా మిత్రుడు రామ్ చరణ్ తేజ్. సినిమా ట్రైలర్ చూసి ఫోన్ చేసి ఈ సినిమా ఆడాలని సపోర్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పి సపోర్ట్ చేయించారు. వారసత్వం అనేది అందరికీ ప్రాపర్టీ ద్వారా వస్తే చిరంజీవి గారి క్యారెక్టర్ రామ్ చరణ్‌కు వారసత్వంగా వచ్చింది. చిరంజీవి గారికి, రామ్ చరణ్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. శ్రీకారం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూస్తే సరదాగా ఊరెళ్లి అందరితో గడిపినట్లుగా ఉంటుంది. మిక్కీజే మేయర్ సంగీతం చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను అందరూ ప్రోత్సహించాలి. జై జవాన్.. జై కిసాన్’’ అన్నారు.
 
డైరెక్టర్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు చిరంజీవిగారి గ్రీటింగ్ కార్డ్స్ కోసం పోటీ పడేవాళ్లం. నా జీవితంలో ఒక్కసారి చిరంజీవి గారిని చూస్తే చాలనుకున్నా. అలాంటిది ఇప్పుడు నా ఆనందాన్ని చెప్పలేకపోతున్నా. నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది నా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట గారు. 4 ఏళ్ల నుంచి పేరెంట్స్‌లా నన్ను భరించారు. శర్వా అన్నను హీరోగా కంటే అన్నగానే చూస్తాను. మా గురువు గారు బుర్ర సాయిమాధవ్ గారు.. నేను అక్షరాలను అడిగితే ఆయన జీవాన్ని పోశారు. వ్యవసాయ కుటుంబాల్లో ప్రేమలు ఎంత సహజంగా ఉంటాయో సినిమా కూడా అంత సహజంగా ఉంటుంది. ’’ అన్నారు.
 
Srikaram team
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ..‘‘మెగాస్టార్ చిరంజీవిగారు ఇచ్చే సపోర్ట్ ఎంత విలువైందో మాటల్లో చెప్పలేనిది. మా సినిమా ప్రమోషన్స్‌కు బూస్టప్ ఇచ్చిన మెగా పవర్ స్టార్‌కు కూడా థ్యాంక్స్. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా థ్యాంక్స్. శ్రీకారం సినిమా విషయానికి వస్తే.. వ్యవసాయం చేద్దామనుకునే ఒక కుర్రాడికి ఎదురైన సంఘటనలు.. అసలు ఆ కుర్రాడు వ్యవసాయం ఎందుకు చేయాలనుకున్నాడో చెప్పే కథే శ్రీకారం. ఎమోషన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ కిషోర్ చాలా మోషనల్ ఫెలో. అంతే ఎమోషనల్‌గా సీన్స్ రాసుకున్నాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా.’’ అన్నారు.
 
ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ..‘‘మెగాస్టార్ అనే ఒక నక్షత్రం ప్రసరించిన వెలుగుల నుంచి దారి చూసుకుంటూ నేను నడుస్తున్నారు. నేనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం మెగాస్టార్ నుంచి వచ్చే వెలుగులో దారి చూసుకుంటూ నడుస్తోంది. ఇండస్ట్రీని నడిపిస్తున్న ఆ వెలుగు శ్రీకారం టీమ్‌ను ఆశీర్వదించడానికి వచ్చారు. సక్సెస్‌కు ఇదే శ్రీకారం. చిరంజీవి గారు ఆశీర్వదించడం అంటే 150 పైచిలుకు సినిమాలు ఆశీర్వదించినట్లే. ఆయన సృష్టించిన ఎన్నో సంచలనాలు ఆశీర్వదించినట్లే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటాను కోట్లమంది మెగాభిమానులు ఆశీర్వదించినట్లే. ఇక ఈ సినిమా సక్సెస్ కాకుండా ఎలా ఉంటుంది? ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఉంది. నేను ఎక్కువగా మెగాఫ్యామిలీ సినిమాలకే రాశాను. ఖైదీ నంబర్ 150కి రాయడం వల్లే శ్రీకారం సినిమాకు అవకాశం వచ్చిందని అనుకుంటున్నా. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా అందరూ తప్పక చూడాల్సిన సినిమా’’ అన్నారు.
 
హీరోయిన్ ప్రియా అరుళ్ మోహన్ మాట్లాడుతూ..‘‘చిరంజీవి సర్.. నేను మీకు బిగ్ ఫ్యాన్. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఇంత మంచి స్టోరీ రాసిన డైరెక్టర్‌కు పెద్ద థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. స్వీటెస్ట్ కోస్టార్ శర్వానంద్‌కు థ్యాంక్స్. శ్రీకారం సినిమాను అందరూ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి.’’ అన్నారు.
 
డైలాగ్ కింగ్ సాయికుమార్ తను రాలేకపోయినా ఏవీ ద్వారా మాట్లాడుతూ ‘‘రైతే రాజు.. రైతుకు పట్టాభిషేకం చేయడానికి వస్తున్న శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. శ్రీకారాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో అందరికీ అండగా నిలిచే అందరివాడు అన్నయ్య. ‘ఆచార్యా’ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్. ప్రస్థానం తర్వాత మా మంచి శర్వానంద్‌తో నేను చేస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమాకు పని చేసిన అందరికీ అభినందనలు. నేను రాకపోయినందుకు క్షమించండి. శ్రీకారాన్ని దిగ్విజయం చేయండి. గ్రామ రాజ్యమే రామ రాజ్యం. జై రైతన్న’’ అన్నారు. 
 
మంత్రి పువ్వాడ అజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేజిపైనే మెగాస్టార్ చిరంజీవికి సత్కారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘అన్నయ్య చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా ఉండడం వల్లే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతోంది. నేను రిక్వెస్ట్ చేయడం వల్లే ఆచార్య షూటింగ్ ఖమ్మం జిల్లాలో చేయడానికి అంగీకరించారు. కేటీఆర్‌కు, రామ్ చరణ్‌కు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి గారిని బాగా చూసుకోమని కేటీఆర్ గారు నన్ను ఆదేశించారు. ఆయన హైదరాబాద్‌లో జరగబోయే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిక పెద్ద ఫ్యాన్‌ను. ఆయన సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాణ్ని. ఆయన సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. సినిమా పరిశ్రమకే ఒక పెద్దన్నగా వ్యవహరిస్తున్న చిరంజీవి గారు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎప్పటికీ ఇలాగే ప్రజాదారణ పొందాలని కోరుకుంటున్నా. శ్రీకారం సినిమా రైతు గురించి చెప్పే సినిమా. కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారి పాలనలాగే శ్రీకారం సినిమా కూడా సక్సెస్ అవుతుంది.’’ అన్నారు.