మరో హాస్యకెరటం ఆగిపోయింది... కొండవలస లక్ష్మణరావు ఇకలేరు!
మరో హాస్యకెరటం ఆగిపోయింది. నవ్వుల ప్రపంచంలో ఉవ్వెత్తున ఎగసి.. తిరిగి కడలికి చేరిపోయింది. పదిమందినీ కడుపుబ్బా నవ్వించి.. ఆ నవ్వుతోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. తెలుగు సినీప్రపంచానికి కొండంత ఆనందాన్ని పంచిన కొండవలస అలియాస్ కొండవలస లక్ష్మణరావు ఆనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన వయస్సు 69 సంవత్సరాలు. కొండవలస మృతి సినీ జగత్తుతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులను శోకసంద్రంలో ముంచేశారు.
గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన నగరంలోని నిమ్స్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10, 1946లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన కొండవలస.. దర్శకుడు వంశీ - రవితేజ - కళ్యాణి కాంబినేషన్‌లో వచ్చిన 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు'తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో తాను పండించిన హాస్యంతో టాప్ కమెడియన్‌గా మారిపోయారు.
అప్పటి నుంచి సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్ట్‌లో ఉద్యోగం చేస్తూ... వెయ్యికి పైగా నాటకాలు వేసిన కొండవలస తనదైన శైలితో ప్రేక్షకుల్ని మెప్పించారు. సినీ రంగంలోనూ కొండవలస మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'అయితే ఓకే' డైలాగ్‌తో కొండవలస పాపులర్ అయ్యారు. కొండవలస మృతి పట్ల సినీరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరిగనున్నాయి.