ఆడిషన్ పేరుతో దుస్తులు విప్పించి వేధించాడు.. దర్శకుడిపై నటుడు ఫిర్యాదు..
మలయాళ చిత్రపరిశ్రమలో మీ టూ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేరళ రాష్ట్ర చిత్రపరిశ్రమలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణపై ఓ నటుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మలయాళ అగ్రహరో మమ్మూట్టి నటించిన ఓ మూవీ నిర్మాణ సమయంలో ఈ ఘటన జరిగినట్లు నటుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
'2012 కోళికోడ్ చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు రంజిత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక రోజు ఆడిషన్ సాకుతో నన్ను బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని ఓ హోటల్‌కు రమ్మన్నారు. అనంతరం గదిలోకి పిలిచి ఆడిషన్‌లో భాగమంటూ నా దుస్తులు విప్పించి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు' అని నటుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు దర్శకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతవారం నటుడు ఫిర్యాదు చేయగా, తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, రంజిత్ బాలకృష్ణపై ఇప్పటికే ఓ బెంగాలీ నటి ఫిర్యాదు మేరకు కొచ్చిన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2009లో పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ సమయంలో తాను లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నట్లు ఆమె ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలకృష్ణన్‌పై కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు.