గురువారం, 3 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జులై 2025 (14:24 IST)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

air india plane crash
ఎయిరిండియాకు చెందిన విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ విమానాల్లో భద్రత ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయిన ప్రమాదంలో 275 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నిలిచిపోయింది. ఇంధనం నింపుకోవడానికి ఆగిన విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేశారు. 
 
బుధవారం ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం ప్రణాళిక ప్రకారమే వియన్నాలో ఆగింది. అయితే, సాధారణ తనిఖీల సమయంలో విమానంలో ఒక ముఖ్యమైన నిర్వహణ సమస్యను సిబ్బంది గుర్తించారు. దాన్ని సరిచేయడానికి అదనపు సమయం పట్టే అవకాశం ఉండటంతో, వియన్నా నుంచి వాషింగ్టన్‌కు కొనసాగాల్సిన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. 
 
దీంతో ప్రయాణికులను విమానం నుంచి దించివేసి, వారికి ప్రత్యామ్నాయ విమానాల్లో ఏర్పాట్లు చేయడం లేదా టిక్కెట్ డబ్బులు పూర్తిగా వాపసు ఇవ్వడం వంటివి చేసినట్టు చెప్పారు. ఈ కారణంగా, వాషింగ్టన్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏఐ 104 విమానాన్ని కూడా రద్దు చేశారు.
 
మరోవైపు, ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇటీవలికాలంలో ఇది మొదటిసారి కాదు. జూన్ 14న ఢిల్లీ నుంచి వియన్నా వెళ్లిన ఏఐ187 విమానంలో గాల్లోనే తీవ్రమైన హెచ్చరికలు వెలువడ్డాయి. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే 'స్టిక్ షేకర్' వార్నింగ్‌తో పాటు, 'కిందకు వెళ్లొద్దు' (డొంట్ సింక్) అంటూ గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది. ఆ సమయంలో విమానం దాదాపు 900 అడుగుల ఎత్తును కోల్పోయిందని, అయితే సిబ్బంది వెంటనే తేరుకుని విమానాన్ని సురక్షితంగా వియన్నా చేర్చారని అధికారులు వెల్లడించారు.