ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 14 జనవరి 2017 (04:52 IST)

‘గౌతమీపుత్ర శాతకర్ణా', ‘క్రిష్‌పుత్ర శాతకర్ణా’

తొడగొట్టడాలూ, మీసం తిప్పటాలూ, కత్తి దూయటాలూ, భీకర దృశ్యాలతో కేంద్రమంత్రివర్యులనూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులనూ, ప్రేక్షకులనూ వెర్రెత్తిపోయేలా చేసిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి,. సందేహమే లేదు. కానీ ఇది

తొడగొట్టడాలూ, మీసం తిప్పటాలూ, కత్తి దూయటాలూ, భీకర దృశ్యాలతో కేంద్రమంత్రివర్యులనూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులనూ, ప్రేక్షకులనూ వెర్రెత్తిపోయేలా చేసిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి,. సందేహమే లేదు. కానీ ఇది చరిత్రా లేదా కల్పనా, పుక్కిటి పురాణమా అనే ప్రశ్నలు మెల్లమెల్లగా పుట్టుకొస్తున్నాయి. కాల్పనిక మాయాజగత్తును సృష్టించి జనాలకు పిచ్చెక్కించిన బాహుబలికి దీనికి ఏమాత్రం తేడా లేదని విమర్శకులు గళమెత్తుతున్నారు.
 








మరోవైపున తెలంగాణ చరిత్రను ఇంత అభాసపాలు చేసిన సినిమాకు కేసీఆర్ గవర్నమెంటు వినోదం పన్ను ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్నలూ బయలు దేరుతున్నాయి. ఇది చరిత్రలో వెలిసిన గౌతమీ పుత్ర శాతకర్ణి కాదు క్రిష్ పుత్ర అనే జాగర్లమూడి రాధాకృష్ణ ఫక్తు కల్పితాలతో తీసిన శాతకర్ణి అని గుసగుసలు మొదలయ్యాయి కూడా.
 
ఇంతకు శాతకర్ణి సినిమాలో సత్యమెంత, చరిత్ర ఎంత, కల్పన ఎంత, పుక్కిటి పురాణమెంత అని తరచి చూస్తే ఏర్పడేది గందరగోళమే తప్ప మరొకటి లేదంటున్నారు సినీ పండితులు.

 
గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరపుకోవడం మొదలైందని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఉన్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే చరిత్రను పూర్తిగా వక్రీకరించినట్లే. చరిత్రను హృద్యంగా, అందంగా తెరకెక్కించడానికి వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చు. కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదన్నది విమర్శకుల అభిప్రాయం.
 
గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభం అయిందనడం చారిత్రక తప్పిదం. అసలు గౌతమీపుత్ర శాతకర్ణికి, శాలివాహనుడికి సంబంధమే లేదు. ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన 25వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు. శాతకర్ణి కలియుగంలో 2,669 నుంచి 2,694 వరకు అంటే క్రీస్తు పూర్వం 433 నుంచి 408 వరకు అంటే, దాదాపు పాతికేళ్లు ‘గిరి వ్రజం’ను రాజధాని చేసుకొని భారత దేశాన్ని పరిపాలించారు.
 
ఆ తర్వాత శాతకర్ణి చనిపోయాక దాదాపు 485 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు శకం 78లో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన ఉజ్జయనిని రాజధానిగా చేసుకొని భారత్‌ను పాలించారు. గిరివ్రజం ప్రస్తుతం బీహార్‌లో ఉండగా, ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. భారత్‌ను పాలించిన రాజవంశాల్లో శాతకర్ణిది ఎనిమిదవ వంశంకాగా, శాలివాహనుడిది పదవ వంశం. అలాంటప్పుడు శాతకర్ణితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని ఎలా చెబుతారు అన్నది ప్రశ్న.
 
ఇక ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వారు కూడా జరుపుకుంటారు. కలియుగం ప్రారంభానికే ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక, ఇతిహాసక ఆధారాలు ఉన్నాయి. ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5,118 సంవత్సరాలు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలన కలియుగంలో 2,669 ఏళ్లనాడు ప్రారంభమైనదంటే, ఆయన పాలనకన్నా దాదాపు 2,500 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుంది? 
 
గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు వేర్వేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు. వీరిద్దరికి వీరోచిత చరిత్ర ఉంది. వీరిద్దరిపైనా వేర్వేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఇద్దరి చరిత్రను కలిపినట్లయితే అది చరిత్రను వక్రీకరించినట్లే అవుతుంది. సంస్కృతంలో బాస మహాకవి రాసిన ‘చారుదత్తా’కు శూద్రుడు రాసిన ‘మృత్య్సకటికం’ నాటకంలోని ఓ భాగాన్ని జోడించి ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కర్ణాడ్‌ ‘ఉత్సవ్‌’ పేరిట నాటి సంస్కతిని కళ్లకు కట్టినట్లు తీశారు. చరిత్రను వక్రీకరించకుండా అలాంటి ప్రయోగం చేయవచ్చు. చరిత్రేదో, కల్పనేదే ప్రేక్షకులకు తెలిసేలా ఉండాలి. తప్పుదారి పట్టించేలా ఉండరాదు.
 
గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, ఉగాది పండుగ ప్రారంభమైందని  చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, హీరో బాలకష్ణ ఘంటాపథంగా చెప్పారట. వారికి రాసిచ్చిన స్క్రిప్టులో లోపం వుండవచ్చు. కానీ సినిమాకు రాసిన స్క్రిప్టులో కూడా లోపం ఉంటే అది ఎంతమాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కాదు, ‘క్రిష్‌పుత్ర శాతకర్ణి’ అవుతుంది.
 
శాతకర్ణికి వినోదం పన్నా.. హవ్వ
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్ర కంటే కల్పన ఎక్కువన్న సత్యం అంగీకరించడానికి బాలయ్య అభిమానులూ, లేక తెలుగుమీసం మొలిపించిన సినిమా అంటూ పొంగుపోతున్న వారు ఒకపట్టాన ఒప్పుకోకపోవచ్చు కానీ, విడుదలైన రోజే ఈ సినిమా ఏమిటీ, తెలుగు వారి చరిత్ర ఏమిటీ అని విమర్శిస్తున్నవారున్నారు.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారని, సినిమా మొత్తం చారిత్రక అసత్యాలతో కూడి ఉందని పలువురు చరిత్రకారులు అంటున్నారు.
 
తెలంగాణలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షులు కెప్టెన్‌ ఎల్‌.పాండురంగారెడ్డి, హైదరాబాద్‌ డక్కెన్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ అధ్యక్షులు డాక్టర్‌ చిరంజీవి కొల్లూరి, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ప్రతినిధి డి.పి.రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ చరిత్రను, ఇక్కడి కళాకారులను ప్రొత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వడం సరికాదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు.
 
వినోదపన్ను రద్దు కమిటీ నివేదిక లేకుండా పన్ను రద్దు చేశారని, వెంటనే పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని,  లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. సినిమాలో పేర్కొన్నట్లుగా గౌతమీపుత్ర శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని, ఇతని తల్లి బాలశ్రీ నాసిక్‌లో వేయించిన శిలా శాసనములో ఈ విషయాన్ని పేర్కొనలేదని తెలంగాణ మేదావులు గుర్తుచేశారు. 
 
ఈయన భారతదేశం మొత్తం పాలించారని చూపారని, కాని కేవలం పశ్చిమ దక్కన్‌ పీఠభూమి మాత్రమే శాతకర్ణి ఆధీనంలో ఉందని తెలిపారు. శాతకర్ణి ఇండో గ్రీకు రాజైన డిమిట్రిస్‌తో యుద్ధం చేశాడన్నది చారిత్రక అసత్యమని, డిమిట్రిస్‌ క్రీస్తుపూర్వం 312కు చెందిన వారని, అతనికి శాతకర్ణికి 390 సంవత్సరాలు తేడా ఉందన్నారు. అతను తెలంగాణ వారిగా చూపారని, కాని మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవపట్టించి డబ్బులు సంపాదించుకునేందుకు సినిమా బృందం వినోదపన్ను రద్దు చేయించుకుని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతోందని ఆరోపించారు. 
 
ఈ పన్ను గొడవలూ ఇతర సిగపట్లూ పక్కనపెట్టి చూస్తే తెలుగు సినిమా చరిత్ర పేరుతో తీసిన అనేక సినిమాలు చరిత్రకు అభాసే కానీ అలసైన చరిత్ర కాదని గత నుంచే రుజువైపోయింది. కళాఖండాలుగా పేరు గాంచిన మల్లీశ్వరి కానీ, మహామంత్రి తిమ్మరుసు గాని కల్పనను వాస్తవంగా భ్రమింపజేసిన అచారిత్రిక సినిమాలుగానే చెప్పాలి. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణిని కూడా ఆ కోవలోకే చేర్చివచ్చు. అయినా కల్పనతో, భ్రమలతో, మెలోడ్రామాలతో, భావోద్వేగాలతో కాసులు పండించుకునే సినిమా రంగంలో చరిత్ర రచనలు ఏమిటి?  చరిత్ర రచనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం భావోద్వేగాలను ఆమడ దూరంలో పెట్టడం. 
 
కానీ గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో ఇప్పుడు తెలుగునేల మీద జరుగుతున్నదేమిటి? ముఖ్యమంత్రులూ, కేంద్రమంత్రులూ కూడా శాతకర్ణి మాయలోపడి అది తెలుగువారి చరిత్ర అంటూ పరమ అభ్యంతరకరంగా సమర్థనలు కురిపించడం ఏమిటి? 
 
ఇది బాలకృష్ణ నటనను, క్రిష్ శ్రమను కించపరచడం కాదు. బాలయ్య అభిమానులను గాయపర్చడం అంతకంటే కాదు. ఫక్తు వాణిజ్యవిలువలతో తీసిన సినిమాలో అసలైన చరిత్రను వెదుక్కోవడం కంటే అసంబద్ధమైన పని మరొకటి ఉండదని గ్రహిస్తే చాలు..