1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (17:25 IST)

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Kamal Haasan
Kamal Haasan
ఉలగనాయగన్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'థగ్ లైఫ్'. భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సిద్ధమవుతోంది. జూన్ 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మే 16న భారీస్థాయిలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించాలని టీమ్‌ భావించింది.
 
అయితే, ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు కమల్‌హాసన్‌ 'ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్' అంటూ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు.
 
'మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మే 16న నిర్వహించాల్సిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్  కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాము.
 
మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ ఇది వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయమని నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో సముచితమైన సమయంలో ప్రకటిస్తాం.
 
ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి' అని కమల్ హాసన్ తెలియజేశారు.