బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 28 మే 2018 (17:45 IST)

మన ఒంగోలు పేరు నిలబెట్టాలని మాదాల నాతో అన్నారు: మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినిమా ఎర్రజెండాను చూసింది ఆయనతోనే. ఎర్రజెండాను హీరోగా మలుచుకుంది ఆయనే. సినీ పరిశ్రమలో మాదాల అడుగు పెట్టిన తర్వాత ఏ పరిస్థితిల్లోనూ తన సిద్ధాంతాలను విడవలేదు. ఎర్రజెండా గౌరవాన్ని తగ్గించలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే చివరి శ్వాస వరకు ఉన్నా

తెలుగు సినిమా ఎర్రజెండాను చూసింది ఆయనతోనే. ఎర్రజెండాను హీరోగా మలుచుకుంది ఆయనే. సినీ పరిశ్రమలో మాదాల అడుగు పెట్టిన తర్వాత ఏ పరిస్థితిల్లోనూ తన సిద్ధాంతాలను విడవలేదు. ఎర్రజెండా గౌరవాన్ని తగ్గించలేదు. తను ఎలా ఉండాలనుకున్నాడో అలానే చివరి శ్వాస వరకు ఉన్నారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఈ నెల 27 ఆదివారం తుది శ్వాస విడిచారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న భౌతికకాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు.
 
కమిట్మెంట్ ఉన్న కథానాయకుడు మాదాల రంగారావు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాదులో మాదాల రంగారావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ... "నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి మాదాల రంగారావు గారితో పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే... నాతో అత్యంత సన్నిహితంగా ఉండి, నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లలో దర్శకుడు టి.కృష్ణ, మాదాల రంగారావు గారు కూడా ఉన్నారు.
 
ప్రత్యేకించి నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఒంగోలులో నేను చదువుకున్న రోజుల నుంచి వారితో పరిచయాలు ఉన్నాయి. దీంతో, నాపై ఆయన ప్రత్యేక అభిమానం చూపించేవారు. ‘మనం ఒంగోలు నుంచి వచ్చామయ్యా! నువ్వూ అభివృద్ధిలోకి రావాలి.. మన ఒంగోలు పేరు నిలబెట్టాలి’ అని ఎంతో ఉత్సాహపరిచేవారు. ఒక కమిట్మెంట్‌తో విప్లవాత్మక సినిమాల్లోనే మాదాల నటించారు. కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు వచ్చినప్పటికీ తిరస్కరించారు. ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మాదాల మరణంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మాదాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.