సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (14:23 IST)

మ‌గ‌ధీర‌ను మించిన మీస‌క‌ట్టు - రామ్ చరణ్ గెట‌ప్ పై బాలీవుడ్ ప్ర‌శంస‌

Ram Charan
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా నుంచి ‘దోస్తీ’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది.’’ అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
 
ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లురి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది. ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్‌ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి.