శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (14:57 IST)

"ఆచార్య" ఐటమ సాంగ్‌పై ఆర్ఎంపీల అభ్యంతరం.. పోలీసులకు ఫిర్యాదు

మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ దర్శకుడు కొరటాలశివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". వచ్చే నెలలో ప్రేకక్షకుల రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చిత్రంలోని పాటలను లిరికల్ ఆడియోల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలచేసిన లిరికల్ ఆడియో పాటులకు అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
ముఖ్యంగా, తాజాగా చిరంజీవి, రెజీనా కెస్సాండ్రా కాంబోలో వచ్చిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. అయితే, ఈ పాటతోనే ఓ కొత్త వివాదం చెలరేగింది. ఈ పాటలోని లిరిక్స్ తమను కించపరిచేలా ఉందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఆర్ఎంపీ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ పాటలోని లిరిక్‌లో "ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే" అనే లైన్ ఉంది. అంటే అందమైన అమ్మాయిలను టచ్ చేయొచ్చనే ఉ్దదేశ్యంతో కుర్రాళ్లు ఆర్ఎంపీ వైద్యులు అయిపోతున్నారనే విధంగా ఆ లిరిక్ అర్థం వుంది. 
 
దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై రాష్ట్రంలోని జనగామకు చెందిన ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాలశివపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.