ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (16:19 IST)

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

jani master
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ షేక్ జానీబాషా మాస్టర్‌పై పోక్సో కేసు నమోదైంది. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో యాడ్‌ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
'2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్‌ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు' అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు.