గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 26 ఏప్రియల్ 2017 (05:18 IST)

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలీకముందే సినిమా చూసేయాలి. ఇదే ఆ క్రేజీ రహస్యం

ఆధునిక సినిమా కళ ఆవిర్భవించి నూట పాతికేళ్లు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఒక ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని కోట్లమంది ప్రజలు ఒక సినిమా విడుదల కోసం ఇంతగా వెర్రెత్తిపోతున్న ఘటనను చరిత్ర మునుపెన్నడూ చూడలేదు. ఆ

ఆధునిక సినిమా కళ ఆవిర్భవించి నూట పాతికేళ్లు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఒక ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని కోట్లమంది ప్రజలు ఒక సినిమా విడుదల కోసం ఇంతగా వెర్రెత్తిపోతున్న ఘటనను చరిత్ర మునుపెన్నడూ చూడలేదు. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరో ముందుగా చూసి చెప్పేయడం కంటే మనమే తొలిరోజు చూసేద్దామన్న ఆత్రుత. ఆ ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ సమాధానం తెలుసుకోవడానికి బాహుబలి-2 సినిమా టిక్కెట్లకోసం వెంపర్లాట. ప్రపంచమంతా వెంపర్లాట.
 
వై కట్టప్పా కిల్డ్ బాహుబలి? ‘బాహుబలి 2’ సినిమా చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిపోతుంది! సస్పెన్స్‌ విడకుండా తెలుసుకోవాలంటే.. మొదటి రోజు మొదటి షో చూడాల్సిందే!! ‘మర్నాడో.. మూడోనాడో చూద్దాంలే’ అనుకుంటే సస్పెన్స్‌ విడిపోవచ్చు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ముందే తెలిసిపోవచ్చు! ఆ తర్వాత సినిమా చూసినా ఆ మజా ఉండదు!! 
 
అందుకే.. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ఫీవర్‌ అలుముకుంది!! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి! దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారిదీ అదే ఉత్సుకత!! ఈ ఉత్సుకతను.. మేనియాను సినీ కలల బేహారులు ఇప్పటికే రెండు చేతులా సొమ్ము చేసేసుకుంటున్నారు.

బాహుబలి దెబ్బకు 28న తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లు, మల్టీప్లెక్సులు కిటకిటలాడిపోనున్నాయి! మిగతా సినిమాలన్నీ మిగిలిన 10 శాతం థియేటర్లలో సర్దుకోవాల్సిందే. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. టికెట్‌ బ్రోకర్లు వాటిని కొనేసి, ఎక్కువకు అమ్ముకుంటున్నారనీ ఆరోపిస్తున్నారు.

మరికొందరేమో.. కేవలం 5 నుంచి 10 శాతం టికెట్లనే అమ్మకానికి పెట్టి, మిగతా టికెట్లను బ్లాకులో అమ్మడం ద్వారా థియేటర్ల యాజమాన్యాలే ఈ డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. టికెట్లు దొరక్కపోతుండడంతో రాజకీయ నాయకులు, పోలీసుల సాయం అడుగుతున్నారు. సినిమా కోసం ఆ రోజు సెలవు పెట్టేస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో.. కంపెనీల్లో 28న సెలవులపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.