శుక్రవారం, 25 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By SELVI.M

సంక్రాంతికి కానుకగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్"

అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి. కంభన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్".

పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన టాలెంటెడ్ డైరక్టర్ బి. రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి. రాజా మాట్లాడుతూ.. "కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురిస్తుంది. అయితే వారి స్నేహానికి మచ్చ కాకూడదన్న ఉద్దేశంలో ప్రేమను మనసులోనే దాచుకుంటారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలవల్ల వారి స్నేహం గెలిచిందా? ప్రేమ గెలిచిందా అనేది ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందింది.

నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ హైలైట్‌ అవుతుంది. హీరో, హీరోయిన్లు కొత్త వారైనప్పటికీ చాలా బాగా చేశారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ మ్యూజిక్ మరో హైలైట్‌గా నిలిచింది" అని రాజా తెలిపారు. ఎన్నో సూపర్ డూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన విద్యాసాగర్ ఈ కథ వినగానే ఎంతో ఇన్‌స్పైర్ అయి మ్యూజిక్ చేయడానికి అంగీకరించారు. సందర్భానికి తగినట్లుగా చాలా చక్కని సంగీతం అందించారని దర్శకుడు అన్నారు.

నిర్మాత ఇ.వి.వి. కంభన్ మాట్లాడుతూ.. చక్కని కాన్సెప్ట్‌తో వస్తున్న జాయ్ అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడికి తొలి సినిమా అయినప్పటికీ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, విద్యాసాగర్ మ్యూజిక్ అదిరిందని కంభన్ అన్నారు.

మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక పబ్ సాంగ్‌తో పాటు 15 రోజుల టాకీ, వైజాగ్‌లో ఒక పాట, కొంత టాకీపార్ట్, హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఒక పాట చేశామని నిర్మాత తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

సునీల్, వెన్నిరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆకాష్ అశోక్ కుమార్, సంగీతం: విద్యాసాగర్, పాటలు: భువన చంద్ర, మాటలు: స్వర్ణ సుధాకర్, ఎడిటింగ్: వి.టి. విజయన్, ఆర్ట్: వెంగల్ రవి, భాస్కర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బి. రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. గోపాల్, సమర్పణ: ఇ.వి. కుమార్.