పాకిస్తాన్ బోర్డర్లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా నేడే విడుదలైంది. చందు మెండేటి దర్శకుడు. కార్తికేయ 1,2, సవ్యసాచి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కించారు. తండేల్ అనేది మత్స్యకారుల జీవితాల్లో నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జీవిత గాథ. 2019లో జరిగిన ఓ రియల్ స్టోరీతో సినిమా తీశామని చెప్పారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
వైజాగ్ సమీపంలోని శ్రీకాకుళం సముద్ర తీరంలోని పల్లెకారుల కుటుంబంలో జరిగిన కథ. రాజు (నాగచైతన్య), చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన సత్య ఉరఫ్ బుజ్జితల్లి (సాయిపల్లవి)ని ప్రేమిస్తాడు. వేటకు వెళితే నెలల తరబడి తిరిగిరారు. అలాంటి వారి జీవితాల్లో రాజు, సత్యలు ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అలాంటిది ఇకపై వేటకు వెళ్ళవద్దని రాజుతో సత్య మాట తీసుకుంటుంది. కానీ రాజు వేటకోసం గుజరాత్ వెళతాడు. అక్కడ సముద్రంలో తుఫాన్ కారణంగా దారి తప్పి పాకిస్తాన్ బోర్డర్‌కు చేరుకుంటారు. ఆ తుఫాన్లో పాకిస్తాన్ బోట్లో ఓ వ్యక్తిని రక్షిస్తాడు. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ రాజుతో పాటు 21మందిని అరెస్ట్ చేస్తారు. మరోవైపు సత్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేయడాని కి సత్య తండ్రి పృధ్వీ నిర్ణయిస్తాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
మొదటి భాగమంతా రాజు, సత్యల ప్రేమ మీదనే కథ సాగుతుంది. వేటకు వెళ్ళినా రాజు మనస్సంతా సత్య దగ్గరే వుంటుంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఓ దశలో చిరాకు తెప్పిస్తాడు. ఇదే డైలాగ్‌ను సత్య చేత దర్శకుడు చెప్పిస్తాడు. సాదా లవ్ కథలో మలుపు అనేది ఇంటర్వెల్‌కు ముందు వచ్చేది. సెకండాఫ్‌లో ఆసక్తిగా కథను నడపడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎక్కడా ఫీలింగ్ కలగదు.
ఈ సినిమాను చూస్తుంటే మణిరత్నం రోజా సినిమా గుర్తుకు రాకమానదు. భర్త అరవింద్ కోసం భార్యగా మధుబాల చేసిన పోరాటం కానీ పడిన స్ట్రగుల్ కానీ సత్యలో కనిపించినా దర్శకుడు అంత ఫీల్ కలిగించలేకపోయాడు. అరవింద్ స్వామి పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి విడుదలవుతాడా? లేదా? అనేది గూస్ బంప్స్ చూసేవారికి క్రియేట్ చేస్తాయి. ఇందులో కూడా పతాక సన్నివేశంలో ఓ వ్యక్తి కోసం రాజు చేసే దీక్ష వున్నా అంత ఫీల్ రాదు. దానికి నటీనటుల్లో లోపం కూడా ఓ కారణంగా కనిపిస్తుంది. ఇక సినిమాకు కెమెరాపనితనం, సంగీతం ప్రధాన హైలైట్‌గా చెప్పవచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథనంలో చిన్నపాటి లోపాలు కనిపిస్తాయి. అందరూ వద్దన్నా పాకిస్తానీ జాలరిని రక్షించే కంగారులో బోర్డర్ దాటేస్తారు రాజు టీమ్.
ఇక ఆ పాత్ర తాను పాకిస్తానీ అని పోలీసులకు, కానీ కోర్టు ముందు కానీ చెప్పించకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ జైలులో వుండే తీవ్రవాదులు క్రూయల్ మెంటాలిటీ కొద్దిగా చూపించే ప్రయత్నం చేసినా దాన్ని మరింత హైలైట్ చేస్తే బాగుండేది. తీవ్రవాదులు ఇండియన్ ఖైదీలంటే దారుణంగా ట్రీట్ చేస్తారు. అలా చాలా కథలు పేపర్లలో వచ్చాయి. క్లైమాక్స్ సుఖాంతం అవుతుందని అందరికీ తెలిసిందే. ఎలా అయింది అనేది దర్శకుడి ప్రతిభ. సత్య ఢిల్లీవరకు వెళ్ళి రాజు కోసం చేసే పోరాటం సినిమాలో కీలకం. ఆమె నటన, నాగచైతన్య నటన చాలా బాగుంది. ఇద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది. ఎటొచ్చీ దర్శకుడు కథనంపై మరింత కసరత్తు చేయాల్సింది. ఆ లోటు కాస్త కనిపిస్తుంది.
రేటింగ్ 2/5