మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:11 IST)

గుంటూరుకు కోడెల పార్థివదేహం : 18న అంత్యక్రియలు.. మొబైల్ కోసం ఖాకీల గాలింపు

హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు భౌతికకాయం గుంటూరుకు చేరుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నుంచి ప్రత్యేక ఆంబులెన్స్‌లో కోడెల పార్థివదేహాన్ని గుంటూరుకు తరలించారు. అక్కడకు చేరుకోగానే జిల్లా కేంద్రంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. 
 
ఈ యాత్ర నకిరేకల్‌, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా విజయవాడకు తరలించారు. ఇదిలావుండగా, కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఏపీలోని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
ఇదిలావుంటే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఆత్మహత్య అనంతరం పోలీసుల సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 
 
కాగా, కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఓ కాల్ మాట్లాడినట్టు సమాచారం. మరిన్ని వివరాల కోసం పోలీసులు కోడెల గన్‌మెన్, ఇద్దరు డ్రైవర్లను, సెక్యూరిటీ గార్డును ప్రశ్నించారు. కోడెల కాల్‌డేటా పరిశీలిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందేమోనని పోలీసులు భావిస్తున్నారు.