సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:14 IST)

పల్నాటి పులిలా బతికా.. ఇపుడు కక్షగట్టి వేధిస్తోంది.. అవమానం తట్టుకోలేకపోతున్నా : కోడెల

తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచి, వచ్చిన తర్వాత కూడా పల్నాటి పులిలా బతికానని, అలాంటి తాను ఇపుడు అవమానాలు భరించలేక పోతున్నట్టు నవ్యాంధ్ర తొలి స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. 
 
రాష్ట్రంలో అధికార మార్పిడి సంభవించిన తర్వాత గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబ సభ్యులను వైకాపా ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు లేకపోలేదు. ఆ కారణంగానే కోడెల కుమారుడు, కుమార్తెతో పాటు.. కోడెలపై కూడా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. 
 
వీటిని భరించలేని కోడెలో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇపుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి చివరకు ప్రాణాలు విడిచారు. కోడెల ఆత్మహత్యను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అటు అభిమానులు, ఇటు పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు సన్నిహితులు చెబుతున్నారు. 
 
ఇటీవల కాలంలో తన సన్నిహితులతో తరచుగా మాట్లాడిన కోడెల ఎంతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. "నాకు తలవంపులు తెచ్చి, నన్ను మానసిక చిత్రవధ చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. కేసుల పేరుతో వెంటాడుతూ, దర్యాప్తు పేరుతో ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం ఇంత దిగజారుతుందని అనుకోలేదు. కక్షగట్టి నన్ను ఇలా క్షోభకు గురిచేయడం దారుణం" అంటూ సన్నిహితులతో పేర్కొన్నట్టు మీడియాలో ప్రసారమవుతోంది.