సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (16:01 IST)

ఏమయ్యా... బుర్రాబుద్ధీ వుందా... పులిరాజా సాంబార్ అన్నం తిని చచ్చిందా?

పులిరాజా సాంబార్ అన్న తిని చచ్చింది... సాంబార్ అన్నం తిని వాంతులు చేసుకుని మరీ చచ్చిపోయింది పులిరాజా.. ఇలాంటి హెడ్డింగులతో రెండుమూడు రోజుల క్రితం నుంచి ఓ వార్త హల్చల్ చేసింది. ఊటీ రిజర్వ్ ఫారెస్టులో అటవీశాఖ అధికారులకు చచ్చిన పులి కనబడింది. దాని చావుకు వాళ్లు కారణం కూడా చెప్పేసారు.
 
ఐతే వాళ్లు చెప్పినదాన్ని సరిగా చూడకుండా సాంబార్ అన్నం తిని పులిరాజా చచ్చిందంటూ ఆయా వెబ్ సైట్లు, మీడియా హౌస్‌లు వార్తలు రాసేశాయి. పులిరాజా సాంబార్ అన్నం తిని చచ్చింది అనగానే సాధారణంగానే జనాలకి డౌటు వచ్చేసింది. దీంతో అసలు ఆ పులి ఎందుకు చచ్చిందన్నదానిపై లోతుగా చూస్తే అసలు విషయం బయటపడింది. పులి తిన్నది సాంబార్ జింకని అని. ఊటీ పరిసర అడవుల్లో వుండే జింకల్లో సాంబార్ జింకలు అనే పేరుతో జింకలున్నాయి. ఈ సాంబార్ జింకను తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే ఆ పులి చచ్చింది.
 
పోస్టుమార్టం చేసిన పిదప ఈ విషయం బయటపడింది. దాని కడుపులో టేప్‌వర్మ్ అనేది వుండటమూ, లోపలు బ్లేడు కూడా లభ్యం కావడంతో వీటి కారణంగానే అది మృత్యువాత పడిందని అధికారులు వెల్లడించారు. నదిలో నీటిని తాగిన తర్వాత అది రక్తం కక్కుకుని చచ్చిపోయింది. సాంబార్ జింకను తిన్న తర్వాత అది మృత్యువాత పడిందని అధికారులు వెల్లడించారు. 
 
ఆంగ్లంలో ఎవరో సాంబార్ తిన్న తర్వాత చచ్చిన పులి అని హెడ్డింగ్ పెట్టడాన్ని చూసిన కొంతమంది తమిళ మీడియావారు దాన్ని కాస్తా సాంబార్ అన్నంగా మార్చేసి వార్తలు పెట్టేశారు. దీనిపై విపరీతంగా ట్రోల్స్ వెళ్తున్నాయి. ఏమయ్యా... బుర్రాబుద్ధీ వుందా... అసలు ఆ అడవిలో సాంబార్ ఎక్కడి నుంచి వస్తుంది... అని కొందరు, సాంబార్ జింక అనేది తెలియకుండా సాంబార్ అన్నం తిని చచ్చిందని రాస్తారా అంటూ గేలి చేస్తున్నారు. అందుకే రాసేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకుని రాయాలి మరి. 
 
ఇటీవలే ఓ తమిళ పత్రిక... చంద్రయాన్ 3 దిగ్విజయంగా నింగిలోకి వెళ్లిపోయిందనీ, జాబిలమ్మను త్వరలో ముద్దాడబోతోందని రాసి అభాసుపాలైంది. కనుక ఏదో సంచలన వార్త కదా అని రాస్తే అది కాస్తా మీడియా సంస్థకు చెడ్డపేరు తెచ్చేదిగా మిగులుతుంది. తస్మాత్ జాగ్రత్త.