exit polls: ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ అర్థం కావట్లేదు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కేంద్ర స్థాయిలో దాదాపు ఎన్డీయేకే పట్టం కట్టినట్లు కనబడుతున్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించిన వెల్లడించిన సర్వేల్లో ఒక్కో సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడుతారోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఆరా మస్తాన్ సంస్థ అయితే పురుషులందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మహిళలందరూ వైసిపికి ఓటు వేసారనీ, ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ కనుక వైసిపి మరోసారి అధికారంలోకి రానుందంటూ సర్వేలో వెల్లడించారు. ఇక జాతీయ మీడియాకు చెందిన ఎగ్జిట్ పోల్స్ అయితే... అధికభాగం కూటమిదే అధికారం అని చెబుతున్నాయి. ఇదంతా చూస్తుంటే... ప్రత్యేకించి ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరి దారి వారిదే అన్నట్లు తెలుస్తోంది. కనుక ప్రజా తీర్పు ఎలా వుంటుందోనన్నది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే.
పిఠాపురంలో పవన్ భారీ విజయం ఖాయం
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే పీఠం అని ప్రధాన మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన మీదట ఆయా సంస్థలు ఈ ఫలితాలను వెల్లడించాయి. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గతంలో లేనంతగా ఏపీ ప్రజలు అత్యధిక శాతం ఓటింగులో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమిదే అధికారం అంటూ తేల్చాయి.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించింది. జనసేన పోటీ చేసిన 2 లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. తెనాలి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా విజయం సాధిస్తారని తెలియజేసారు.