బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు...
ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్ హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
శిరీషను ప్రేమిస్తున్నానంటూ చరణ్ కొంతకాలం ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇటీవల ఇంటికి వచ్చిన చరణ్ నాలుగు రోజుల క్రితం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మళ్లీ తిరిగి గ్రామానికి వచ్చి, శుక్రవారం శిరీష ఇంటికి వెళ్లాడు. ఆమెతో మాట్లాడే క్రమంలో…తనతో తెచ్చుకున్నకత్తితో ఆమె గొంతులో పొడిచాడు. అక్కడి కక్కడే ఆమె కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఆమెను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. శిరీష తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా…శిరీషను పొడిచి పారిపోబోతున్న చరణ్‌ను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అతను ప్రమాదకర ద్రావణం తాగాడని తెలిసి పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.