సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:52 IST)

ప్రైవేటు యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా

ప్రైవేటు యూనివర్శిటీల్లో ఇకపై 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఎపి ప్రైవేట్‌ యూనివర్సిటీ యాక్ట్‌ 2006కు సవరణలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఈ సవరణలతో కూడిన బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నియామకాలు పారదర్శకంగా జరగాలని, సిఫార్సులకు చోటు ఉండకూడదని చెప్పారు. తొలిసారిగా ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేవారికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని సిఎం ఆదేశించారు.

ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యాసంస్థలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని, ఐదేళ్ల పాటు ఇది కొనసాగాలని చెప్పారు. ఈ ప్రామాణికతనుఅందుకున్న పక్షంలోనే యూనివర్సిటీగా అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని ఆదేశించారు.

డిగ్రీ, ఇంటర్‌ కోర్సుల్లో పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఇంజనీరింగ్‌, వైద్య విద్యా కళాశాలల మాదిరిగానే ఇంగ్లీష్‌లో బోధన చేయాలని చెప్పారు. ఒకేసారి ఇంగ్లీష్‌ ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలను రెండు మాధ్యమాల్లో ముద్రించాలని ఆదేశించారు.

డిగ్రీ మొదటి ఏడాదిలో ఇందుకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. 11,12 తరగతులు కూడా ఇంగ్లీష్‌ మీడియం లోకి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించే పాఠ్యప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు..

ఎయిడెడ్‌ కళాశాలల నిర్వహణ ప్రభుత్వంలోనైనా, లేదంటే ప్రైవేట్‌ యాజమాన్యాల చేతిలోనైనా ఉండాలనే అభిప్రాయాన్ని ఈ సమావేశంలో సిఎం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికీ అన్‌లిమిటేడ్‌ ఇంటర్నెట్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు.

దీంతోపాటు అమ్మఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నామని చెప్పారు. ఈ చర్యలు విద్యా, నైపుణ్య రంగాల్లో పెనుమార్పులు తీసుకొస్తాయని చెప్పారు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోసం ఇంటర్నెట్‌ లేని వైఫై ప్రోటోకాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.