ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:02 IST)

4.50 లక్షల కార్డులు తొలగింపా ?: సాకే శైలాజనాథ్

సంక్షేమ ప్రభుత్వం అని  చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన రేషన్ కార్డులను తొలగించడం ద్వారా వారికి పట్టెడు అన్నం దూరం చేసినట్లేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ ఆరోపించారు.

అర్హులైన వారికి కొత్త కార్డులు ఇచ్చామంటున్న సర్కారు ప్రస్తుతం ఉన్న కార్డులకు ఏవేవో కారణాలు చూపి తొలగించడం అన్యాయమన్నారు. శుక్రవారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ నవశకం ద్వారా వలంటీర్లతో ఇంటింటి సర్వేను నిర్వహించారని, బియ్యం కార్డు అర్హత ఆర్ధిక పరిమితి పెంచారని, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.

రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా బియ్యానికి ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేశారని, 13 నెలల వ్యవధిలో గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 15వతేదీ వరకు 16.45 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులను మంజూరు చేశారన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగా అప్పట్లోనే 17లక్షల కార్డుల రద్దుకు సిద్ధమైందని, దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినా ఆ తర్వాత కొద్దికాలానికే 8లక్షల కార్డులు ఒకేసారి తొలగించిందన్నారు.

మళ్లీ ఇప్పుడు ఒక్కదెబ్బలో 4.64 లక్షల కార్డులు తొలగించిందని, గతంలో ఒక్కవేటున 8 లక్షల కార్డులను తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దాదాపు 5లక్షల కార్డులు పీకేసిందన్నారు. అటు లెక్కలేనంత సంక్షేమం అంటూనే ప్రక్షాళన పేరుతో పింఛన్లు, కార్డులకు కోతపెట్టి ప్రభుత్వం కోట్లు మిగుల్చుకుంటోందని డాక్టర్ సాకే శైలాజనాథ్ విమర్శించారు.

సెప్టెంబరు వరకు రాష్ట్రంలో 1,49,07,718 కార్డులు ఉంటే, అక్టోబరుకు వచ్చేసరికి ఆ సంఖ్య 1,44,42,895కు తగ్గింది. అంటే నెల వ్యవధిలోనే 4,64,823 కార్డులు లేకుండా పోయాయి. తాజాగా తొలగించిన కార్డుల్లో 10,03,182 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.

వారంతా ఇప్పుడు శాశ్వతంగా రేషన్ కోల్పోవడంతో పాటు ఇతర పథకాలకూ దూరమయ్యారని,  ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే రేషన్ తోపాటు కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా కలిపితే ఒక్కో కుటుంబ సభ్యుడికి 10 కిలోల బియ్యం వస్తుందని, ఈ లెక్కన  10,12,355 లక్షల మందికి ఇస్తున్న 1.01 కోట్ల కిలోల బియ్యం కేంద్ర, రాష్ట్రాలకు ఆదా అయినట్లే అన్నారు.

కిలో రూ.40 లెక్కన చూసినా రూ.40 కోట్లకు పైగా నెలకు ఖర్చు తగ్గుతుందని, అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 55,198 కార్డుల్ని పక్కన పెట్టగా అందులో 1.25 లక్షల మంది ఉన్నారని, కర్నూలు జిల్లాలో 54,063 కార్డులు తగ్గాయని. వీటి పరిధిలో 1.20 లక్షల మంది సభ్యులున్నారన్నారు.

మొత్తంగా ఈ రెండు జిల్లాల్లోనే 2.45 లక్షల మందికి రేషను బియ్యం కోతపడిందని, సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 4.65 లక్షల కార్డులకు కోత పడిందన్నారు. వీటి పరిధిలోని 10.12 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల నుంచి రేషన్ సరఫరా నిలిచిపోనుందని, వీరికి ప్రభుత్వం అన్యాయం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసారు.