నిశ్చితార్థం కోసం అరటి గెలలు కోయబోతే విద్యుత్ షాక్... నలుగురు దుర్మరణం..
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిశ్చితార్థం వేడుక కోసం ఆరటి గెలలు తేవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మండలంలోని పాతరౌతుపేటకు చెందిన కొమ్మ వెంకన్న (49) తన కుమారుడు శ్రీనుకు ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించాడు.
ఇందుకోసం అరటి గెలలు తేవడానికి ఆదివారం ఉదయం కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావమరిది ఆబోతుల రాములు (57)కు చెందిన అరటితోటకు బావ, బావమరిదిలు ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ చెట్లకు హెచ్‌టీ విద్యుత్ తీగలు తగులుతున్నాయని గమనించని వెంకన్న, రాములు గెలలను కోయబోయారు.
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం వెళ్లిన మనుషులు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన రాములు భార్య పుణ్యవతి (53), వెంకన్నకు సోదరి వరుస అయ్యే రౌతు బంగారమ్మ (52) తోటకు వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్నవారిని పట్టుకోవడంతో వారికి కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించారు.