సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్.సందీప్ కుమార్
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:04 IST)

కర్నాటక గంగమ్మ ఆలయంలో విషాహారం వెనుక అక్రమ సంబంధం...

కర్ణాటక చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణం గంగమ్మ ఆలయంలో వారం రోజుల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన కేసు కొలిక్కివచ్చింది. ఈ ఆలయంలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరికి నిజాన్ని కనుగొన్నారు. విచారణలో భాగంగా నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగుచూసాయి. 
 
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ప్రసాదాన్ని తయారు చేసిన లక్ష్మీ (46) అనే మహిళే ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే లక్ష్మీ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని లోకేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దానికి అతని భార్య శ్రీగౌరి అడ్డుగా ఉందని భావించిన లక్ష్మీ ఆమెను చంపడానికి మంచి వ్యూహాన్నే రచించింది. దీనిని అమలు చేయడానికి ఇద్దరు సన్నిహితుల సహాయం తీసుకుంది. 
 
ప్రణాళిక ప్రకారం ప్రసాదంలో విషం కలిపి దానిని పంచిపెట్టే బాధ్యతలను వారికి అప్పగించింది. శ్రీగౌరి ప్రసాదాన్ని తీసుకున్నా కూడా దానిని తినకుండా తన తల్లి సరస్వతమ్మకు(56) ఇచ్చింది. దానిని తిన్న ఆమె అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఇలా ప్రసాదం తిన్న కవిత (22) అనే మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. 
 
ఆమెకు సహకరించిన అమరావతి, పార్వతమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీగౌరి గతంలో ఇలాంటి ప్రసాదం తిని 15 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నానని చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోకేశ్‌ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆలయ నిర్వాహకులు ఎలాంటి ప్రసాదం తయారుచేయలేదని, ఇద్దరు మహిళలు తెచ్చి పంచిన కేసరిలోనే విషం కలిసిందని వెల్లడించారు. ఇలాంటి ఘటనే చామరాజ్‌నగర్ జిల్లాలోనూ రెండు నెలల క్రితం జరిగింది. 14 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఇందుకు కారణమైంది.