రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి పట్టా అందించిన హోం మంత్రి
ప్రేమోన్మాది చేతిలో హతురాలైన రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను శనివారం సుచరిత అందజేశారు.
హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ, రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని, రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
అందరూ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పాలడుగు ఘటనలో పోలీసు విచారణ జరుగుతుందని నిందితులను పట్టుకోగానే మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడతారన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని మంత్రి సుచరిత వెల్లడించారు.