శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:52 IST)

డ‌బ్బుకు అమ్ముడుపోయామట‌... బోరుమన్న ర‌మ్య త‌ల్లితండ్రులు

మా బిడ్డ ర‌మ్య‌ను పోగొట్టుకుని మేం బాధ‌ప‌డుతుంటే, మేం డబ్బులకు అమ్ముడుపోయామంటూ కొంద‌రు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార‌ని ర‌మ్య త‌ల్లితండ్రులు భోరుమంటున్నారు. వీళ్ళ కార‌ణంగా తాము ఇంట్లో భోజనం చేయలేకపోతున్నామ‌ని డిజిపికి ఫిర్యాదు చేశారు.

రమ్య హ‌త్య కేసులో విచార‌ణ త్వ‌ర‌గా చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినందుకు ర‌మ్య కుటుంబ సభ్యులు డిజిపి స‌వాంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను డిజిపికి వివరించారు. ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశార‌ని, పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేద‌ని రమ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, మానసికంగా వేధిస్తున్నార‌ని రమ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

డబ్బులకు అమ్ముడుపోయామంటు కామెంట్లు చేస్తున్నార‌ని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్నార‌ని రమ్య కుటుంబ సభ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని రమ్య కుటుంబ సభ్యులు కోరారు.

రమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన డి‌జి‌పి స‌వాంగ్, కేసు దర్యాప్తును పోలీసులు వేగంగా పూర్తి చేశారని, ద‌ర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాల‌ని, వారికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భ‌రోసా కల్పించారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామ‌ని డిజిపి చెప్పారు.

రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేసామని, కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరుతామ‌న్నారు. మహిళల‌ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంద‌న్నారు.